Yadagirigutta: గుట్టపై ఘనంగా మహా పూర్ణాహుతి

Written by RAJU

Published on:

  • నృసింహుడిని దర్శించుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

యాదాద్రి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన సోమవారం పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు కథ వైదిక కార్యక్రమాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం, పూర్ణాహుతి, లక్ష్మీనరసింహులకు శ్రీపుష్పయాగం దేవతోద్వాసన.. దోపు కథ వైదిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం చక్రతీర్థ స్నాన వేడుకను సంప్రదాయ రీతిలో స్వామివారి విష్ణు పుష్కరిణిలో నిర్వహించారు.

అనంతరం వసంతోత్సవం నిర్వహించి, పవిత్ర జలాలతో సుదర్శన చక్రతీర్థ స్నాన పర్వాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా బ్రహ్మోత్సవాల్లో విశ్వశాంతి, లోకకల్యాణం కోసం యాగశాలలో హవన పూజలు కొనసాగగా.. మహోత్సవ పరి సమాప్తిలో భాగంగా మంత్రోచ్ఛారణలతో మహా పూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. సాయంత్రం కల్యాణ లక్ష్మీనరసింహులకు వివిధ పుష్పాలు సమర్పించి శ్రీపుష్పయాగం, అనంతరం దోపోత్సవం జరిపారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో ఏపూరి భాస్కర్‌రావ ు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Subscribe for notification