ABN
, Publish Date – Mar 10 , 2025 | 04:39 AM
ప్రజలను ఇబ్బందిపెట్టి ఎవరు పైశాచికానందం పొందుతున్నారు రేవంత్‌రెడ్డీ.. హైడ్రా పేర ఇళ్లను కూలగొట్టి నువ్వు పైశాచికానందం పొందావు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయించావ్

హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలను ఇబ్బందిపెట్టి ఎవరు పైశాచికానందం పొందుతున్నారు రేవంత్‌రెడ్డీ.. హైడ్రా పేర ఇళ్లను కూలగొట్టి నువ్వు పైశాచికానందం పొందావు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయించావ్. ఆశా వర్కర్లను పోలీసులతో ఎగిరెగిరి కొట్టించావ్. పేరు మర్చిపోయారని అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి, అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల వీపులు పగలగొట్టి, గుమ్మడి నర్సయ్య నాలుగుసార్లు వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా పైశాచికానందం పొందింది నువ్వే’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకు పడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో కార్మికులు మరణిస్తే ఆనందం పొందే స్థితిలో కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు లేరన్నారు. 16 రోజులవుతున్నా 8 మంది ప్రాణాల గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయుందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలన చేతగాక ప్రకృతిపై కూడా నిందలు వేస్తున్నారని, ఎండలకు పంటలు ఎండుతున్నాయంటూ చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ఎండలు లేవా? అని నిలదీశారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన విధానం.. పార్టీ వైఖరిపై కేసీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.
Updated Date – Mar 10 , 2025 | 04:39 AM