Yadadri: కనులపండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం.. గోవింద నామస్మరణతోమార్మోగిన ప్రాంగణం – Telugu News | Yadagirigutta Lakshmi Narasimha Swamy wedding ceremony

Written by RAJU

Published on:

Yadadri: ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. ఏకశికర వాసుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పాంచ నరసింహుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కనుల పండవగా జరిగింది. కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. స్వర్ణ కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. స్వామివారు కళ్యాణాన్ని భక్తులు తిలకించి తరించారు. యాదాద్రి కొండపై స్వామివారి కళ్యాణం జరిగినంత సేపూ కల్యాణ మంటపం, యాదాద్రి క్షేత్రమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది.

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం శనివారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి అలంకరణలో గజవాహనంపై ఊరేగింపుగా రాగా భక్తకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు బయలుదేరారు.

కల్యాణ వైభోగమే.. లక్ష్మీ నరసింహుడి కళ్యాణం కమనీయం..

శ్రీస్వామి వారు ధర్మమూర్తియైన శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనముపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించి ‘ధర్మో రక్షతి రక్షితః’ అను సందేశాన్ని తెలియజేస్తున్నాడని శ్రీరామ అలంకారము, హనుమంత సేవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా వచ్చిన వధూవరులు.. పుష్పాలంకరణ, విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్న ఆలయ ఉత్తర మాడవీధిలోని కల్యాణ వేదికపై ఆసీనులయ్యారు. కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు స్వామి,అమ్మవార్లను అధిష్టింప జేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. విశ్వక్సేనుడి తొలి పూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన అభిజిత్‌ లగ్న సుముహూర్తాన రాత్రి 8.45 గంటలకు దేవదేవుడు, మహాలక్ష్మి అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు.

అంబరాన్ని తాకిన నరసింహుడు కల్యాణోత్సవం

సంబోద్భవుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగళ్యధారణ మహోన్నతంగా జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ నామస్మరణ మిన్నంటిన శుభవేళ.. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకై భక్తజనం పోటెత్తిన సమయాన.. జగత్‌ కల్యాణం అందరినీ ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. ఈ అపూర్వ ఘట్టం భక్తకోటి హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవంతో యాదగిరిగుట్ట పులకరించింది. దేవదేవుడితో జరిగిన మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్త జనులు కనులారా వీక్షించారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనయ్యే ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరించారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగనుంది. స్వామివారి కరుణా కటాక్షాలు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు.

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న యాదాద్రి కొండ..

యాదాద్రి పుణ్య క్షేత్రంలో పంచ నరసింహుడు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండు గంటలపాటు శాస్ర్తోక్తంగా జరిగిన తతంగం ఆధ్యాత్మిక శోభను సంతరింపజేసింది. ప్రధాన పూజారులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహా చార్యులు, మోహనాచార్యులు పూజారులు కల్యాణ పర్వాలను నిర్వహించారు. కల్యాణోత్సవంలో అర్చక బృందం, పారాయణీకుల వేదఘోష, భక్తుల గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవం నెలకొంది.

స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తరించిన భక్తజనం..

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, బంగారు ఆభరణాలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, దేవదాయ శాఖ కార్యదర్శి అర్చకులకు అందజేశారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశుల య్యారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification