– కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు
– ఎంఐఎం, సీపీఐకి ఇస్తారా? లేదా?
– ఈ అంశంపై చర్చించేందుకే సీఎం ఢిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలస్థానాలభర్తీ, వాటి నామినేషన్లకు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులెవరనే చర్చ ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లి రావడంతో ఈ చర్చ పతాక స్థాయికి చేరుకుంది. అభ్యర్థులెవరు? సామాజిక సమీకరణాలేంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల్లో ఇప్పటివరకు పదవులు రాని నేతలెవరు?. బీసీ కులగణన, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీలు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రకరకాల విశ్లేషణల్లో నాయకులు తలమునకలయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముఖ్యమంత్రికి కావాల్సిన వారెవరు? ఎమ్మెల్సీ ఎంపిక చేయడంలో మంత్రుల జోక్యమెంటిి? మంత్రులు ఏవరెవరికి సిఫారసు చేస్తున్నారు? ఇత్యాది అంశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఉంది. అందులో ఒక స్థానం బీఆర్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉన్నది. మిగతా నాలుగింటిలో ఎవర్ని బరిలోకి దించాలనేదానిపై కాంగ్రెస్ వేట పూర్తి చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలంటూ సీపీఐ కోరింది. కానీ మారిన సమీకరణాల నేపథ్యంలో ఈసారికి వీలుకాదని హస్తం పార్టీ చెప్పినట్టు తెలిసింది. ఎంఐఎం కూడా ఒక స్థానాన్ని అడిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇస్తామన్న హామీతో ఆ పార్టీ వెనక్కి తగ్గినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నాలుగింటిలో కాంగ్రెస్ అభ్యర్థులను సర్దుబాటు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నది. ఒకవైపు పార్టీ అంతర్గతంగా చర్చలు…మరోవైపు ఏఐసీసీ అగ్రనేతలతో సంప్రదింపులు…ఇలా ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు బిజీబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఆశావాహుల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన నేపథ్యంలో ఆయా వర్గాల నుంచి దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ,మాల సామాజిక వర్గాల నాయకుల్లో పోటీ పోటాపోటీగా ఉన్నది. ఎవరి వైపు మొగ్గు చూపాలనేది పార్టీకి కత్తిమీద సాములా మారింది. మైనార్టీలు, ఎస్టీలు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ యువతకు ప్రాధాన్యతను ఇవ్వాలనే సూచనమేరకు యువత, విద్యార్థి నేతలు కూడా తమకు తెలిసిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. తాజాగా ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందంమేరకు కమలం వికసించిందంటూ హస్తం పార్టీ నేతలు పైకి చెబుతున్నా…పార్టీ బలహీనంగా ఉందనేది మరోసారి చర్చనీయాంశమవుతున్నది. ఈ ప్రాంతంలో మున్నూరుకాపు (ఓబీసీ) సామాజిక తరగతి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. ఆ సామాజికతరగతిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందనే అపవాదు కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఓబీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు, చైర్మెన్ పదవుల్లో ఉన్న వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేయొద్దు అని పార్టీ నిర్ణయించింది. ‘ఒక నాయకుడికి ఒక పదవి’ సూత్రాన్ని పాటించాలని అధికార పార్టీ భావిస్తున్నది. దీని ప్రకారం చైర్మెన్లకు, పోటీ చేసి ఓడిపోయిన వారికి, ఇతర ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. ముఖ్యంగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎమ్మెల్సీ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆయన జాతీయ స్థాయిలో ఓబీసీ చైర్మెన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వీహెచ్ తన బయోడేటాను కూడా అధిష్టానానికి పంపినట్టు తెలిసింది. సీనియర్ నేత విజయశాంతి సేవలను రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నది. సరిత తిరుపతయ్య గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ ఓడిపోయారు. ఆమెకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చేందుకు పార్టీ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మున్నూరుకాపు సామాజిక తరగతికి చెందిన యువతనేత, మాజీ ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ పేరు ఎమ్మెల్సీ రేసులో బలంగా వినిపిస్తున్నది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది. పార్టీ సూచనమేరకు ఆయన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం కలిసొచ్చినట్టు గాంధీభవన్‌వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి కూడా పార్టీ ఆదేశంమేరకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మైనార్టీ, ఎస్టీ సామాజికతరగతి చెందిన షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషీ, శంకర్‌నాయక్, విజయబాయి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో అధిష్టానం ఎవర్ని ఎంపిక చేస్తుందో వేచిచూడాల్సిందే.