- 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’..
- సీబీఐ అధికారులమని నటించిన మోసగాళ్లు..
- రూ. 20 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు..

Digital Arrest: దేశంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. సీబీఐ అధికారుమని బెదిరించిన మోసగాళ్లు ఆమె వద్ద నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టారని గురువారం పోలీసులు తెలిపారు. మహిళ నుంచి డబ్బు వసూలు చేయడానికి సీబీఐ అధికారులుగా నటిస్తూ బెదిరించాడని, 2024 డిసెంబర్ 26 నుంచి ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
నిందితులు బాధితురాలిని రెండు నెలల పాటు ఇంట్లోనే ఉండేలా చేసి, ప్రతీ మూడు గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఆమె ఎక్కడ ఉందో తనిఖీ చేసేవారని పోలీసులు తెలిపారు. సైబర్ పోలీసులు ఆ మహిళకు చెందిన రూ. 77 లక్షల్ని స్తంభింపజేయగలిగారు. ఈ నెల ప్రారంభంలో ఆ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తనకు సీబీఐ అధికారులమని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, తన ఆధార్ కార్డు ద్వారా మనీలాండరింగ్ కోసం ఒక బ్యాంక్ ఖాతా తెరిచారని చెప్పాడని వెల్లడించింది. సదరు నేరగాడు ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తుందని, ఆమె తన గదిలోనే ఉండాలని చెప్పి, మాట వినకుంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామని, ఆమె పిల్లల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
Read Also: Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ వర్మల వివాహబంధానికి తెర.. కోర్టు విడాకులు మంజూరు
ఆ ఇంట్లో పనిమనిషి, వృద్ధ మహిళ ప్రవర్తనను గమనించింది. కేవలం ఆహారం కోసం మాత్రమే ఆ గది నుంచి బటయకు రావడం, గదిలోకి వెళ్లి గట్టి అరవడం గురించి పనిమనిషి ఆమె కుమార్తెకు తెలిపింది. అయితే, వృద్ధురాలని భయపెట్టిన మోసగాళ్లు ఆమె బ్యాంక్ వివరాలను రాబట్టారు. కేసు, కోర్టు ఫీజుల నుంచి తొలగించడం వంటి కారణాలు చూపుతూ నెల వ్యవధిలో ఆమె నుంచి రూ. 20.26 కోట్లు బలవంతంగా వసూలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, డబ్బు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. వీటిలో ఒకటి మలాడ్ ప్రాంతానికి చెందిన షాయల్ జమీల్ షేక్(20) అని గుర్తించారు. 2024 డిసెంబర్ 26 మరియు ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
జమీల్ షేక్ పట్టుబడిన తర్వాత, నిందితుడు రజిక్ అజాన్ బట్(20)ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం పోలీసులు మరో నిందితుడు హృతిక్ శేఖర్ ఠాకూర్ (25) ను గుర్తించి, అతని ఖాతాలో రూ. 9 లక్షలు బదిలీ అయ్యాయని, అతన్ని అర్థరాత్రి అరెస్టు చేశారని ఆయన తెలిపారు. అజాన్ బట్ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల రాకెట్‌లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు.