42మంది టీమ్‌తో స్కెచ్‌.. కోటిన్నర హాంఫట్.. అన్ లక్కీ భాస్కర్ కథ మామూలుగా లేదుగా..

Written by RAJU

Published on:

తమిళనాడులో లక్కీ భాస్కర్‌ సినిమా స్టైల్లో మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. తిరుపత్తూర్‌ ఇండియన్‌ బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తున్న భాస్కరన్‌ చేతివాటం చూపాడు. నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టించి కోటిన్నర కాజేశాడు. అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేశాడు. 42మందితో ఓ టీమ్‌ తయారు చేసి, వాళ్లతో బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించాడు. తనే అప్రైజర్‌ కాబట్టి, అది రియల్‌ గోల్డ్‌ అనేలా గోల్‌మాల్‌ లెక్కలు వేసి, తన దొంగ బ్యాచ్‌కి డబ్బులు అందేలా చూశాడు.

అధికారుల విచారణలో దొరికిపోయిన భాస్కరన్‌

నగదు లెక్కల్లో తేడాలు రావడంతో అధికారులు విచారణ షురూ చేశారు. దీంతో భాస్కరన్‌… డూప్లికేట్‌ గోల్డ్‌ లోన్‌ దందా బయటపడింది. నకిలీ గోల్డ్‌ పెట్టు… కోట్లు కొల్లగొట్టు స్కీమ్‌ తిరగబడింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో అప్రైజర్‌ భాస్కరన్‌ని అరెస్ట్‌ చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

వృద్ధ దంపతులకు దగ్గరై..

ఇక బెంగళూరులోని గిరినగర్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తోంది మేఘన. ఆ బ్యాంక్‌లో ఉమ్మడి ఖాతా ఉన్న వృద్ధ దంపతులతో ఆమెకు పరిచయం పెరిగింది. అలా బ్యాంకింగ్ వ్యవహారాల్లో సాయం చేస్తూ వారికి బాగా దగ్గరైంది. మేఘనను బాగా నమ్మిన ఆ వృద్ధ దంపతులు తాము చామరాజ్‌పేటలో ఇంటిని అమ్ముతున్న విషయాన్ని కూడా ఆమెతో పంచుకున్నారు. అలా ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కలిపి వారి ఖాతాలో మొత్తం కోటి రూపాయలు జమ అయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్న మేఘన.. ఆ వృద్ధ దంపతుల బ్యాంక్ అకౌంట్‌లోని సొమ్మును కొట్టేయాలని ప్లాన్ చేసింది. వృద్ధ మహిళకు FD ఖాతా తెరవడం గురించి అబద్ధం చెప్పి, RTGS పత్రంపై సంతకం చేయించుకుంది. ఆ తర్వాత మరో కొత్త బ్యాంకు ఖాతాకు RTGS ద్వారా రూ.50 లక్షలను బదిలీ చేసుకుంది.

ఒకరోజు ఆ దంపతుల కుమారుడికి ఈ విషయంలో అనుమానం వచ్చింది. తన పేరెంట్స్‌ చెప్పినంత డబ్బు బ్యాంక్ ఖాతాలో లేదని అతడు గుర్తించాడు. ఫిబ్రవరి 13న కొంత డబ్బు వేరే ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించాడు. దీంతో వారంతా కలిసి గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులను పట్టుకుని అసలు విషయం కనిపెట్టారు.

RTGS ద్వారా అర కోటి కొట్టేసిన మాయలాడి

విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకన్న మేఘన ఇందుకోసం ఆ వృద్ధ దంపతుల డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది. తన భర్త శివప్రసాద్, అతగాడి స్నేహితులు వరదరాజు, అన్వర్ ఘోష్ సాయం తీసుకుంది. వీరి సాయంతో ఓ కొత్త అకౌంట్‌ తెరిచి.. RTGS ద్వారా ఆ ఖాతాకు రూ.50 లక్షలు బదిలీ చేయించింది. ఆ తర్వాత అందులోని రూ.30 లక్షలు వాళ్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. మొత్తం రూ. 50 లక్షలను రికవరీ చేశారు. ఇక పోలీస్ విచారణలో లక్కీ భాస్కర్ స్టోరీ చెప్పింది మేఘన. వృద్ధ దంపతులను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని.. తమకు డబ్బు అవసరం ఉండటం వల్లే వారి డబ్బు తీసుకున్నామని తెలిపింది. ఆ డబ్బుతో లాభం సంపాదించి మళ్లీ వారికే ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని కహానీ వినిపించింది. కానీ చివరకు పోలీసులకు చిక్కిన ఆమె స్టోరీ అన్‌ లక్కీగా మిగిలిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification