300 లోడింగ్‌?!

Written by RAJU

Published on:

300 లోడింగ్‌?!– ముంబయి, హైదరాబాద్‌ ఢీ నేడు
– పరుగుల వరదకు చిరునామా వాంఖడె
ఐపీఎల్‌ 18 ఆరంభానికి ముందే 300 పరుగులపై భారీ అంచనాలు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసక బ్యాటర్లు ఈ మార్క్‌ దాటేస్తారని క్రికెట్‌ పండితులు సైతం విశ్వసించారు!. ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 246 టార్గెట్‌ను ఊదిపడేసిన సన్‌రైజర్స్‌ నేడు వాంఖడెలో 300పై గురి పెడుతుందా?
నవతెలంగాణ-ముంబయి
వరుస పరాజయాల నుంచి బయటపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబయి వాంఖడె స్టేడియంలో నేడు సన్‌రైజర్స్‌ సీజన్లో ఏడో మ్యాచ్‌ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌ సైతం ఓ విజయంతో పుంజుకున్నా.. జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి ప్రపంచ శ్రేణి పేసర్లు ఆ శిబిరంలో జోరందుకున్నప్పటికీ.. నేడు వాంఖడెలో సన్‌రైజర్స్‌ 300 లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌18లో హైదరాబాద్‌, ముంబయిలు ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాయి.
సన్‌రైజర్స్‌ భారీ స్కోర్లకు అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ ముఖ్య కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ట్రావిషేక్‌ మ్యాజిక్‌ గత మ్యాచ్‌తో మళ్లీ మొదలవగా.. క్లాసెన్‌ తనదైన కండ్లుచెదిరే షాట్లతో సిక్సర్లు సంధిస్తున్నాడు. ఓడిన నాలుగు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ భారీ వ్యత్యాసంతో పరాజయం పాలైంది. దీంతో నెట్‌ రన్‌రేట్‌ భారీగా దెబ్బతిన్నది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన సన్‌రైజర్స్‌ ఇప్పుడు విజయంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే వాంఖడెలో 300 స్కోరుపై కన్నేసినట్టు చెప్పవచ్చు. ముంబయి ఇండియన్స్‌లో నాణ్యమైన పేసర్లు ఉన్నప్పటకీ.. వాంఖడె పరుగుల సునామీకి చిరునామా. తొలి నుంచి నుంచే విరుచుకుపడే సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు వాంఖడె స్వర్గధామం అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, ముంబయి ఇండియన్స్‌ సైతం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తెలుగు తేజం తిలక్‌ వర్మ సహా సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. విల్‌ జాక్స్‌, రియాన్‌ రికెల్టన్‌లు ముంబయి తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights