జిల్లాలో పెరుగుతున్న ఎన్సీడీ రోగులు
58వేల మందికి బీపీ, 28వేల మందికి షుగర్
367 మందికి క్యాన్సర్ నిర్ధారణ
కట్టడి చేయకపోతే కొత్త రోగాల ముప్పు
ఆహారపు అలవాట్లే కారణమంటున్న వైద్యులు
(ఆంధ్రజ్యోతి-భువనగిరి కలెక్టరేట్) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లకు వచ్చే ఈ వ్యాధులు ఇటీవలి కాలంలో 30 ఏళ్లు దాటగానే వస్తున్నాయి. రోజువారీ జీవితంలో ఆహారపు అలవాట్లకుతోడు నేటి ఆధునిక జీవనశైలి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారి బీపీ, షుగర్ వస్తే జీవితాంతం అవసరమైన మందులు వాడుతూ ఇబ్బందులు పడాల్సిందేనని, అంతేకాకుండా ఇవి అనేక కొత్త రకాల రోగాలతోపాటు గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నాన కమ్యూనికేబుల్ డిసీజె్‌స(ఎన్సీడీ) ప్రజల ఆధునిక జీవనశైలిలో మార్పులతోనే అధికమవుతున్నాయని, నేషనల్ హెల్త్ మిషన ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శాఖ ద్వారా సర్వేలు నిర్వహిస్తూ ఎనసీడీ క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేసింది. 2011 జనగణన ప్రకారం జిల్లాలో 7.26 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరికి నాలుగు ఎన్సీడీ క్లినిక్‌లతోపాటు ఇప్పటి వరకు 3,53,657 మందిని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్ర్కీనింగ్ చేశారు. ఇందులో 58,228 మందికి రక్తపోటు (బీపీ), 28,739 మందికి షుగర్ (డయాబెటీస్) ఉన్నట్లు తేలింది. బాధితుల్లో 30నుంచి 60 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 90శాతం జీవన శైలిలో మార్పులతో, 10శాతం మందికి మాత్రమే జెనెటికల్‌గా వచ్చినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. బాధితులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తూ నెలరోజులకు సరిపడా మందులను ప్రతీనెల అందిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.
పెరుగుతున్న క్యాన్సర్ పేషెంట్లు
క్యాన్సర్ రోగులశాతం కూడా జిల్లాలో క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 367 మంది క్యాన్సర్ రోగులున్నారు. వారిలో 86 మందికి ఓరల్ క్యాన్సర్, 172 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 109 మందికి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. క్యాన్సర్ రోగుల కోసం భువనగిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ) పాలియేటివ్ వార్డులో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫిజియోధెరపిస్టు అందుబాటులో ఉండి రోగులకు చికిత్స అందిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రి నుంచి ఎంఎనజే క్యాన్సర్ ఆసుపత్రితో పాటుగా హైదరాబాద్‌లోని వివిధ హాస్పిటల్స్‌కు రెఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు.
శారీరక, మానసిక ఒత్తిడితోనే సమస్య
నిర్ణీత సమయం 8 గంటల కంటే ఎక్కువగా పని చేస్తూ శారీరక, మానసిక ఒత్తిడికి గురి కావడం… వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన, వ్యాయామం చేయకపోవడంతో బీపీ, షుగర్ వస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం… చక్కర, ఉప్పు, నూనె ఎక్కువగా వాడటం….జంక్ ఫుడ్ తినడంతో బరువు పెరగడం (ఒబేసిటీ ) వల్ల కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన బీపీ , షుగర్ పేషెంట్లు, ఇప్పుడు గ్రామాలలోనూ బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు. అధిక బీపీతో గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం, ఒత్తిడీని తగ్గించుకోవడం ద్వారా బీపీ షుగర్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు..
-డాక్టర్ సమన కళ్యాణ్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్, యాదాద్రి భువనగిరి జిల్లా