25న చలో తాళ్లరాంపూర్‌

Written by RAJU

Published on:

25న చలో తాళ్లరాంపూర్‌– గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తేయాలి
– రాష్ట్రంలో వీడీసీలను నిషేధించాలి
– గౌడ మహిళలను గుడి నుంచి గెంటేసి, ఈత చెట్లను తగులబెట్టిన వారిని శిక్షించాలి
– ఈ ఘటనపై సీఎర, పీసీసీ చీఫ్‌ స్పందించాలి
– రౌండ్‌టేబుల్‌లో గౌడ, కల్లుగీత, సామాజిక సంఘాల నేతల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్ట మండలం తాళ్లరాంపూర్‌ గ్రామంలో ఆర్నెల్లుగా కల్లుగీత కార్మికులపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఎత్తేయాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లను తక్షణమే నిషేధించాలని కోరింది. గౌడ మహిళలను గుడి నుంచి గెంటేసీ, అక్కడ ఈత చెట్లను తగుటబెట్టిన వీడీసీ సభ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలనీ, వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరింది. బాధితులకు భరోసా కల్పించేందుకు ఈనెల 25న చలో తాళ్లరాంపూర్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పిలుపునిచ్చింది. ‘వీడీసీలపై కఠిన చర్యలు తీసుకోవాలి’అనే అంశంపై చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవీ రమణ మాట్లాడుతూ వీడీసీల ముసుగులో రాజ్యాంగేతరశక్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గ్రామాల్లో దళితులు, బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు కూడా వీడీసీల అరాచకాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని వివరించారు. కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై వీడీసీలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. వాటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నాయని అన్నారు. చెప్పినట్టు వినకుంటే సాంఘిక బహిష్కరణ చేస్తున్నాయని చెప్పారు. ఆర్నెల్ల క్రితం తాళ్లరాంపూర్‌ గ్రామంలో గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేశారనీ, దీంతో వారు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈనెల ఆరున శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం గౌడ మహిళలు గుడికి వెళ్తే అవమానించి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గోడు వినిపించుకుందామని బాధితులు వెళ్తే సుమారు 150 ఈత చెట్లను తగులబెట్టారని అన్నారు. గౌడ కార్మికులకు ఉపాధి లేకుండా వారి పొట్ట కొట్టారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆ గ్రామాన్ని సందర్శించి సాంఘిక బహిష్కరణను ఎత్తేయాలనీ, గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఇందుకోసం టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ కమిషన్‌ చొరవ చూపాలన్నారు. ఈనెల 25న వేలాది మందితో చలో తాళ్ల రాంపూర్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామంటూ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
వీడీసీ సభ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి : పల్లె రవికుమార్‌ గౌడ్‌
కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ అవి గ్రామాభివృద్ధి కమిటీలు కావనీ, గ్రామ అరాచక కమిటీలని విమర్శించారు.వీడీసీల దౌర్జన్యాన్ని ప్రశ్నించడానికి రాజకీయ పార్టీలే భయపడుతున్నాయని చెప్పారు. వీడీసీలు రాజాకార్ల తరహాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు. వీడీసీ సభ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వీడీసీలకు చరమగీతం పాడా లన్నారు. గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్‌ బాలగోని బాలరాజు గౌడ్‌ మాట్లాడుతూ బహుజనులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. వీడీసీలు వృత్తిదారుల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నాయని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య అన్నారు. గౌడ కార్మికులు హిందువులు కాదా? నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ గౌడ కార్మికుల నిధులతో కట్టిన గుడిలోకి వారినే రానివ్వడం లేదన్నారు. వీడీసీలు ప్రజాస్వామ్యానికే పెనుసవాల్‌ అని గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం దశరథ్‌ మాట్లాడుతూ దళితులు, బహుజనుల ఐక్యత ఎంత అవసరమో ఈ ఘటన తెలియజేస్తున్నదని చెప్పారు. గౌడ, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్‌, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్టే విజయకుమార్‌ గౌడ్‌, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్‌, సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జెక్కే వీరాస్వామి గౌడ్‌, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర మల్సూరు గౌడ్‌, జై గౌడ సేన రాష్ట్ర అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌ మాట్లాడుతూ వీడీసీల అరాచకాలపై హైకోర్టు సుమోటోగా స్వీకరించా లని కోరారు. తాళ్లరాంపూర్‌ ఘటనపై డీజీపీ కార్యాలjతో పాటు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్‌, హైదరాబాద్‌ కార్యదర్శి మిర్యాల గోపాల్‌, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కొప్పు పద్మ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights