24 గంటల్లోనే రెండు గిన్నీస్‌ రికార్డులు

Written by RAJU

Published on:

24 గంటల్లోనే రెండు గిన్నీస్‌ రికార్డులు– రొమ్ము క్యాన్సర్‌పై యూట్యూబ్‌లో అవగాహన పాఠం
– ఒక్కరోజులో అత్యధిక వ్యూస్‌
– ప్రతి ఏడాదీ 2 లక్షల రొమ్ము క్యాన్సర్‌ కేసులు : మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరానికి చెందిన ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌, బ్రహ్మకుమారీస్‌తో కలిసి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఇది 24 గంటల్లోనే రెండో గిన్నిస్‌ ప్రపంచ రికార్డు కావడం విశేషం. యూట్యూబ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పాఠానికి 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ అనే అంశానికి ఈ రికార్డు వచ్చింది. గిన్నిస్‌ ప్రపంచ రికార్డు బహూకరణను ప్రపంచ వ్యాప్తంగా 6,218 మంది యూట్యూబ్‌లో చూశారు. 40 నిమిషాలకుపైగా స్పష్టమైన ప్రజెంటేషన్‌ ఇచ్చినందుకు డాక్టర్‌ రఘురామ్‌ను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ (జిడబ్ల్యుఆర్‌)ను సమర్పించిన ఈ ఈవెంట్‌ ఆసియా పసిఫిక్‌ జడ్జి రిషినాథ్‌ అభినందించారు. ఆన్‌ సైట్‌లో ”అతిపెద్ద రొమ్ము క్యాన్సర్‌ అవగాహన పాఠం” కొన్ని రోజుల కిందట డాక్టర్‌ రఘురామ్‌ సాధించిన మరొక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌. మొత్తంగా 24 గంటల్లోనే 11 వేల మందికి పైగా ఈ మెగా ఎవేర్‌నెస్‌ డ్రైవ్‌ ద్వారా లబ్దిపొందారు. ప్రముఖ సర్జన్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌-ఉషా లక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘు రామ్‌ అవగాహన పాఠాన్ని నిర్వహించారు.
ఈ గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ప్రజంటేషన్‌ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 50వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ”డాక్టర్‌ పి.రఘురామ్‌ 24 గంటల్లో 11 వేల మందికి రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించడం ద్వారా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నుంచి రెండు రికార్డులు సాధించడం అభినందనీయం. ప్రతి ఏడాదీ 2 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఏడాదికి లక్ష మరణాలు సంభవిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ అయిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు దేశంలోనే ఉన్నారు. డాక్టర్‌ రఘురామ్‌ కొన్నేండ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్‌పై ప్రచారం చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 4వేల గ్రామాల్లో పెద్దఎత్తున జనాభా ఆధారిత రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమం చేపట్టారు” అని తెలిపారు. డాక్టర్‌ రఘురామ్‌ మాట్లాడుతూ.. ”ఈ గుర్తింపును మా తల్లి, ఐదు నెలల కిందట ఈ ప్రపంచాన్ని వదిలేసిన రొమ్ము క్యాన్సర్‌ విజేత డాక్టర్‌ ఉషాలక్ష్మికి అంకితం చేస్తున్నాను. తగిన అవగాహన లేకపోవడం, సామాన్యులందరికీ స్క్రీనింగ్‌ కార్యక్రమం లేకపోవడం, క్యాన్సర్‌ చికిత్సల్లో అసమానత వల్ల మన దేశంలో 60 శాతానికి పైగా రొమ్ము క్యాన్సర్‌ కేసులు ముదిరిన దశలోనే బయటపడుతున్నాయి. ఈ వ్యాధి చుట్టూ ఉన్న సామాజిక సమస్యలను నివారించడానికి, మహిళలు ఈ వ్యాధిని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై వారిలో సాధికారత కల్పించడానికి ఇదో చిన్న ప్రయత్నం” అని చెప్పారు. కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు మాట్లాడుతూ.. ”కుటుంబానికి స్త్రీ ప్రధాన కేంద్రం అనే విషయాన్ని మరచిపోకూడదు. ఆమె బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. 40 ఏండ్లు దాటిన తమ సన్నిహితులు, సన్నిహితులు వార్షిక స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌ చేయించుకునేలా చూడాల్సిన బాధ్యత పురుషులపై ఉంది” అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రఘురామ్‌ను ఆస్కి చైర్మెన్‌ కె.పద్మనాభయ్య ఘనంగా అభినందించారు.

Subscribe for notification