YSRCP Karanam Balaram: వైసీపీలో ఉండలేకపోతున్న మాజీ మంత్రి.. ఎటూ తేల్చని చంద్రబాబు!

YSRCP Karanam Balaram: సాధారణంగా రాజకీయ నేతలు అన్ని రకాల పదవులు చేపట్టాలని కోరుకుంటారు. కానీ అవకాశం కొందరికి దక్కుతుంది. కొందరకు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోతాయి. అటువంటి నాయకుడే ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం( Karanam Balaram ). ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇలా చట్టసభలకు ఎన్నికైన ఆయన.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కానీ మంత్రి కాలేకపోయారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచి వైసీపీలోకి ఫిరాయించారు. అలా జరగకుండా ఉంటే.. ఈ ఎన్నికల్లో ఆయన చీరాల ఎమ్మెల్యే. ఆపై మంత్రి అయి ఉండేవారు కూడా. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి మంచి అవకాశాన్ని కోల్పోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇందిరాగాంధీని కాపాడిన నేతగా..
ప్రకాశం జిల్లా( Prakasam district) అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కరణం బలరాం. ఆయనకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఏకంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెచ్చిన నాయకుడు కూడా. 1978లో ఒంగోలు పర్యటనకు వచ్చారు ఇందిరా గాంధీ. ఆ సమయంలో ఆమెపై దాడి జరిగింది. అయితే అప్పట్లో కరణం బలరాం ఇందిరాగాంధీని కాపాడి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇందిరాగాంధీ ఆయనను ప్రోత్సహిస్తూ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. అలా అసెంబ్లీలో అడుగు పెట్టారు కరణం బలరాం. కానీ ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు బలరాం. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ప్రకాశం జిల్లా టిడిపి అంటేనే బలరాం అన్నంత రీతిలో పరిస్థితి మారింది. 1999లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే అంతటి మంచి బంధాన్ని తెలుగుదేశం పార్టీతో తెంచుకొని తప్పు చేశానన్న పశ్చాత్తాపంతో ఉన్నారు కరణం బలరాం.

వైసీపీలోకి ఫిరాయింపు..
2019 ఎన్నికల్లో చంద్రబాబు( CM Chandrababu) కరణం బలరాంకు చీరాల టికెట్ ఇచ్చారు. రాష్ట్రమంతట జగన్ ప్రభంజనం వీచింది. కానీ అంతటి ప్రభంజనంలో సైతం చీరాల నుంచి గెలిచారు కరణం బలరాం. కానీ కొద్ది రోజులకే రకరకాల ఒత్తిళ్ళతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ దారుణ పరాజయం ఎదురైంది. అప్పటినుంచి టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్క్ అవుట్ కావడం లేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు. మరోవైపు కొత్త కొత్త నేతలు పుట్టుకొస్తున్నారు. రకరకాల సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆమంచి కృష్ణమోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. దీంతో కరణం బలరాం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.

వివాహ వేడుకలో భేటీ..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబును కరణం బలరాం కలిశారు. ఓ వివాహ వేడుకలో ఏకాంతంగా కలిసి చర్చించారు. టిడిపిలోకి వస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కరణం బలరాం టిడిపిలో చేరడం ఖాయమని ప్రచారం సాగింది. అయితే ఇంతవరకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కరణం బలరాం వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నా.. ప్రకాశం జిల్లా టిడిపి క్యాడర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే కొద్ది రోజులు తర్వాత కరణం బలరాం విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment