US China Trade War: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నీ అమెరికాకే వ్యతిరేకంగా మారుతున్నాయి. మరోవైపు అన్నీ తమకే కావాలన్న స్వార్థంతో ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ప్రపంచంలో అరుదుగా లభించే ఎర్త్ మినరల్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదువుపుతున్నారు. చైనాపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎక్కడా తగ్గడం లేదు. అగ్రరాజ్యానికే సవాల్ విసురుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అమెరికా మిలిటరీ టెక్నాలజీకే ఎసరు వచ్చేలా ఉంది. చెనా తాజాగా రేర్ ఎర్త్ ఎగుమతులపై నియంత్రణలు కఠినం చేసింది. ఈ లోహాలే ఆధునిక మిలిటరీ, సెమీకండక్టర్, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రాణాధారం. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలు ఇప్పటి వరకు ఇవి ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి. ఇప్పుడు బీజింగ్ పట్టుబిగించడంతో ఆ ఆధార వ్యవస్థే కదిలిపోయింది.
రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకంత కీలకం..
రేర్ ఎర్త్ మెటల్స్‌లో నియోడియమియం, ప్రాసియోడియమియం, డిస్ప్రోస్యియం వంటి లోహాలు ప్రధానమైనవి. వీటితో జెట్ ఇంజిన్లు, క్షిపణి నియంత్రణ వ్యవస్థలు, రాడార్ సెన్సర్లు, మొబైల్ ఫోన్లు నిర్మించబడతాయి. ప్రపంచంలోని సుమారు 70% సరఫరా చైనాకు చెందిన గనుల నుంచే వస్తుంది. ఒక గనిలో ఉత్పత్తిని తగ్గించినా ప్రపంచ మార్కెట్లో ధరలు క్షణాల్లో పెరుగుతాయి.
అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ
టెక్నాలజీ ఆధిపత్యం కోసం ప్రతిదశలో చైనాకు సవాలు విసిరిన అమెరికా ఇప్పుడు రేర్ ఎర్త్ సరఫరాలో బంధింపబడిన స్థితిలో ఉంది. మిలిటరీ సాధనాలు, జాతీయ రక్షణ పరిశ్రమల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మూలాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని తక్షణ పరిష్కారం లేదు. దీంతో వాషింగ్టన్ మళ్లీ భారత్ వంటి మిత్రదేశాల సహకారం కోసం చూస్తోంది.
భారత్‌పై ఒత్తిడి..
అమెరికా గతంలో వాణిజ్య టారిఫ్‌లతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మారడంతో భారత్ సహకారం తప్పనిసరైంది. భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో రేర్ ఎర్త్ ఖనిజ వనరులను అభివృద్ధి చేసే దిశగా ముందుకువెళ్తోంది. ఇది భారత్‌కు ద్విగుణ ప్రయోజనం. ఒకటి వ్యూహాత్మక చర్చల్లో ప్రాధాన్యం పెరగడం. రెండోది అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించగలగడం.
ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా..
చైనా ‘‘టెక్నాలజీ ఆయుధం’’గా రేర్ ఎర్త్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. దీంతో అమెరికా, యూరప్ తమ పరిశ్రమల్లో కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రీన్ ఎనర్జీ (ఇవి వాడే బ్యాటరీలు, టర్బైన్‌లు) ప్రాజెక్టులు మందగిస్తున్నాయి. టెక్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాలు చైనా ‘‘సైలెంట్ వెపన్’’ ప్రభావాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి.
రేర్ ఎర్త్ యుద్ధం కేవలం మినరల్ సప్లై పోరు కాదు.. ఇది భవిష్యత్తు టెక్నాలజీ ఆధిపత్యంపై పోరాటం. చైనా ఒకే నిర్ణయంతో ప్రపంచ సరఫరా గొలుసును కుదిపేసింది. భారత్ వంటి దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా కొత్త అవకాశాల సరిహద్దులో నిలిచాయి.