Surekha : కాంగ్రెస్ లో మంత్రి సురేఖ పంచాయితీ.. పవర్ తగ్గిస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వివాదం పీక్స్ కు చేరుకుంది. అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఛాన్స్ దొరికితే రెచ్చిపోతున్నాయి. ఓ వైపు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఛాలెంజ్ విసురుతోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో మంత్రి కొండా సురేఖ పంచాయితీ కొత్త తలనొప్పిగా మారింది. మొన్న ఆమె మాట్లాడుతూ.. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని.. ఆయనకు ఏం పని అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఆ వివాదం ఇంకా ముదిరింది. నిన్న ఆమె ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు ట్రై చేయగా.. సురేఖ కూతురు సుష్మిత అడ్డు పడింది. సుమంత్ ను కొండా సురేఖ తన కాన్వాయ్ లో అక్కడి నుంచి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సుమంత్ గతంలో హుజూర్ నగర్ లోని ఓ సిమెంట్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతన్ని ప్రభుత్వం ఓఎస్డీ నుంచి తీసేసింది. సురేఖ కావాలనే అతన్ని కాపాడుతోందనే ఆరోపణలు రావడంతో సుమంత్ ను అరెస్ట్ చేయాలని ఏకంగా సీఎం రేవంత్ నుంచే ఆదేశాలు వెళ్లాయంటున్నారు. దీంతో కొండా సురేఖ కూతురు సుష్మిత సంచలన వీడియో రిలీజ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీటింగ్ లో తన అమ్మ సురేఖను తిట్టారని చెప్పడం పెద్ద వివాదం రేపింది. తమ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్లు కుట్రలు చేస్తున్నారంటూ చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఏకంగా మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వచ్చింది.

సురేఖ నేడు మీనాక్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ పంచాయితీలపై గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మేడారం జాతర కాంట్రాక్టు పనులను దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సురేఖ పవర్ ను ప్రభుత్వంలో తగ్గిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలపై ఆరోపణలు చేయడంతో.. ఇలాగే ఊరుకుంటే ప్రభుత్వానికే ప్రాబ్లమ్ వస్తుందని ఆమెను కట్టడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు ఆమెకు ఫోన్లలోనే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కీలక ఎన్నికలు ఉన్న టైమ్ లో ఆమె సైలెంట్ గా ఉండాలని సూచించారంట. దీంతో సురేఖ కొన్ని రోజులు సైలెంట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Comment