
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది స్థిరమైన, రిస్క్ లేని ఆదాయాన్ని కోరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పొదుపు పథకం. మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఖచ్చితమైన ఆదాయాన్ని పొందవచ్చు. ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.4శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ ఖాతాలో జమ అవుతుంది. ఇది మీ నెలవారీ ఖర్చులకు గొప్ప సహాయకారిగా ఉంటుంది.
గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..?
ఈ పథకంలో కనీసం రూ.1,000 తో ఖాతాను తెరవవచ్చు. పెట్టుబడి పరిమితుల విషయానికి వస్తే ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇక జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెళ్లైన వారికి, భవిష్యత్తు కోసం కలిసి ప్లాన్ చేసుకోవడానికి జాయింట్ అకౌంట్ బెస్ట్ ఆప్షన్. ఉదాహరణకు మీరు ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు జమ చేస్తే, మీకు నెలకు సుమారు రూ.9,250 ఆదాయం లభిస్తుంది. అదే వ్యక్తిగత ఖాతాలో రూ.9 లక్షలు జమ చేస్తే నెలకు సుమారు రూ.5,550 చొప్పున స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్‌ను తెరవడానికి అవకాశం ఉంది.
మెచ్యూరిటీ – అకౌంట్ వివరాలు
ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు లేదా అప్పటికి ఉన్న తాజా వడ్డీ రేటుతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఈ విధంగా మీ ఆదాయం ఎక్కువ కాలం కొనసాగుతుంది. ముఖ్యంగా 10ఏళ్లు దాటిన పిల్లల పేరు మీద కూడా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఆదాయాన్ని పిల్లల ఫీజులు లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక వ్యక్తి తన గరిష్ట పెట్టుబడి పరిమితికి లోబడి ఎన్ని POMIS ఖాతాలైనా తెరవవచ్చు.
ముందస్తు విత్ డ్రా – పన్ను నియమాలు
అత్యవసర పరిస్థితుల్లో ఈ ఖాతాను ముందస్తుగా మూసివేసే అవకాశం ఉంది. అయితే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా తెరిచిన ఏడాదిలోపు డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. 1 నుండి 3 ఏళ్ల మధ్య ఉపసంహరిస్తే, డిపాజిట్ చేసిన మొత్తంలో 2 కట్ చేసుకుని మిగిలినది చెల్లిస్తారు. 3 ఏళ్ల తర్వాత మూసివేస్తే 1శాతం కోత మాత్రమే ఉంటుంది. పన్ను విషయానికొస్తే.. ఈ పథకం నుండి వచ్చే నెలవారీ వడ్డీ ఆదాయం మీ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే పోస్ట్ ఆఫీస్ దీనిపై TDSను విధించదు. అంతేకాకుండా మీ POMIS ఖాతాను దేశంలోని ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ పథకం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు, రిస్క్ లేకుండా నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..