PM Modi AP Tour: ఏపీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి నిధులు విడుదల, రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచూ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఏపీ పర్యటనకు వచ్చారు. కర్నూలుకు విచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అయితే కర్నూలు ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో శ్రీశైలం బయలుదేరారు. అయితే అదే హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు.
* మూడు పార్టీల మధ్య సమన్వయం..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం( Alliance government ) నడుస్తోంది. మూడు పార్టీల మధ్య చక్కటి సమన్వయం ఉంది. ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. ఈ పరిణామ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో బంధం పెంచుకుంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇంకోవైపు మంత్రి లోకేష్ సైతం ప్రధానితో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడమే కాదు.. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషయంలో చాలా గౌరవభావంతో చూసుకుంటున్నారు. ఈరోజు కర్నూలు పర్యటనలో అది స్పష్టంగా కనిపించింది.
* ఇద్దరితో కలిసి శ్రీశైలం ఆలయానికి..
కొన్ని వందల రకాల వస్తువులపై జిఎస్టి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కనీస అవసరాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ఈ జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. ఈ క్రమంలో ఏపీలోని రాయలసీమలో ఒక సభను ఏర్పాటు చేయాలని భావించింది. కూటమి ప్రభుత్వం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరిగాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపారు. అయితే ముందుగా శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత జిఎస్టి సభలో పాల్గొని.. సుమారు 14 వేల కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శ్రీకరం చుట్టనున్నారు మోదీ. కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రత్యేక హెలిక్యాప్టర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తన వెంట తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరూ లేకుండా ఏపీలో అడుగు తీసి అడుగు వేయలేను అన్నట్టు ప్రధాని మోదీ వ్యవహరించడం మాత్రం అందర్నీ ఆకర్షిస్తోంది.