Pakistan Vs TTP: పాకిస్తాన్‌ పాలు పోసి పెంచిన పాము టీటీపీ… అందుకే మెడకు చుట్టుకుంది

Pakistan Vs TTP: తెహ్రీకే తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) అనేది పాకిస్తాన్‌ స్వయంగా పెంచుకున్న ఉగ్రవాద శక్తి. ఇది అనేక తాలిబాన్‌ వర్గాల కలయికతో ఏర్పడిన సంస్థ. 2007లో బజావుర్, స్వాట్, ఖైబర్‌ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్‌లోని మిలిటరీ, రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి.
దీని వెనుక అల్‌ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా, ఒసామా బిన్‌ లాడెన్‌ చుట్టూ ఉన్న నెట్‌వర్క్‌ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది.

తాలిబాన్‌తో స్నేహమా శతృత్వమా?
ఆఫ్గాన్‌ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్‌ పాక్‌ మధ్య భావజాల సమానత ఉన్నా, లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్‌ తాలిబాన్‌ ప్రధానంగా తమ దేశంతోపాటు పాకిస్తాన్‌లో ఇస్లామిక్‌ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్‌లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్‌ శరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య సామాన్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌–ఆఫ్గాన్‌ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి.

సరిహద్దు మంటల మూలం
డ్యూరాండ్‌ లైన్‌ 1893లో బ్రిటన్‌ గీసిన సరిహద్దు. ఇది పస్టూన్‌ తెగలను రెండుభాగాలుగా చీల్చింది. ఆఫ్గానిస్తాన్‌లో సగానికి పైగా ప్రజలు పస్టూన్లు కావడంతో, ఆ దేశం ఆ రేఖను ఎప్పుడూ చట్టబద్ధమని ఒప్పుకోలేదు.
పస్టూన్‌ నేషనలిజం ఇప్పటికీ ఉభయ దేశాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. ఈ వివాదమే ప్రస్తుతం జరిగిన ఆఫ్గాన్‌–పాక్‌ ఘర్షణలకు ప్రధాన కారకం.

అమెరికా–పాకిస్తాన్‌–ఉగ్రవాదం..
2001 తర్వాత అమెరికా ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తాన్‌ ‘‘మిత్రదేశం’’గా వ్యవహరించినప్పటికీ, ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది. అమెరికా దీనిపై దాడులు ప్రారంభించడంతో పాకిస్తాన్‌కు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో స్థానిక తాలిబాన్‌ వర్గాలకు మద్దతు నిచ్చింది. దీని ఫలితంగా పాకిస్తాన్‌ అల్‌ఖైదాకు టార్గెట్‌గా మారింది. ఇప్పుడు అదే శక్తి పాకిస్తాన్‌ దహిస్తోంది.
భారత్‌–ఆఫ్గాన్‌ స్నేహం..
భారత్‌కు ఆఫ్గానిస్తాన్‌ ఎప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశం. పాకిస్తాన్‌ను చుట్టుముట్టే విధంగా ఆఫ్గాన్‌ స్నేహం భారత్‌ భద్రతకు బలంగా మారుతోంది.
ఆఫ్గాన్‌ విదేశాంగ మంత్రి ముత్తఖీ ఇటీవల భారత్‌ పర్యటన చేయడం ఇస్లామాబాద్‌ను రగిలించింది. దీని వెనుక ‘శత్రువు పట్ల శత్రుడు మిత్రుడు‘ అనే చాణక్య సూత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆఫ్గాన్‌–పాకిస్తాన్‌ యుద్ధం..
కొనసాగుతున్న ఘర్షణలు రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పూర్తిగా ఛిద్రం చేశాయి. డ్యూరాండ్‌ లైన్‌ వెంబడి ఇరువైపులు భారీ నష్టం చవిచూస్తుంటే, పస్టూన్‌ ప్రాంతాలు యుద్ధక్షేత్రాలుగా మారాయి. పాకిస్తాన్‌ లోపల టీటీపీ దాడులు పెరిగిపోయి, ఆ దేశ సైన్యం తీవ్ర ఒత్తిడిలో ఉంది.

భారత్‌ వ్యూహాత్మక మద్దతు..
పాకిస్తాన్‌ ఇప్పుడు అమెరికా సహాయంతో ఆఫ్గానిస్తాన్‌పై దాడి చేస్తోంది.
ఈ పరిస్థితిలో భారత్‌ రష్యాతో కలసి ఆఫ్గాన్‌ పట్ల సహకారం కొనసాగించడం కీలకం.
ఆఫ్గాన్‌ ప్రజాస్వామ్యాన్ని, శాంతి స్థాపన చర్యలను పరస్పరం బలోపేతం చేయడం ద్వారా భారత్‌ తన భద్రతా పరిధిని బలపరచుకోవచ్చు.

తెహ్రీకే తాలిబాన్‌ పాకిస్తాన్‌ స్థాపన, ఆ సంస్థ దిశ, పాకిస్తాన్‌–ఆఫ్గాన్‌ మధ్య శత్రుత్వం, భారత్‌–ఆఫ్గాన్‌ స్నేహం అన్నీ ఒకే వ్యూహాత్మక వలయంలో మలచబడ్డాయి.
ఇది కేవలం ఉగ్రవాదం కాకుండా, దక్షిణ ఆసియాలో శక్తి సమీకరణాలు ఎలా మారుతున్నాయనే దానికి నిదర్శనం.

Leave a Comment