Ola Shakti: బ్యాటరీ స్టోరేజ్ మార్కెట్లోకి ఓలా

Ola Shakti: బ్యాటరీ స్టోరేజ్ మార్కెట్లోకి ఓలా

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌, దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎనర్జీ స్టోరేజ్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటనలో ‘ఓలా శక్తి ‘ బ్రాండ్ పేరుతో బ్యాటరీలను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి బ్యాటరీ, సెల్ టెక్నాలజీని రూపొందించాం. ఓలా శక్తి ద్వారా ఇళ్లలో క్లీన్ ఎనర్జీని నిల్వ చేసుకునేందుకు, ఉపయోగించేందుకు వీలవుతుంది. ఇది కంపెనీకి సహజమైన ముందడుగు లాంటిది. ఓలాకు ఉన్న 4,680 సెల్ టెక్నాలజీ, గిగా ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం, దేశవ్యాప్తంగా ఓలా నెట్‌వర్క్ ద్వారా అదనపు పెట్టుబడి లేకుండా బ్యాటరీ స్టోరేజ్ మార్కెట్లో రాణించగలం. ప్రస్తుతం రూ. లక్ష కోట్ల మార్కెట్‌గా ఉన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బీఈఎస్ఎస్), 2030 నాటికి రూ. 3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఓలా ఎలక్ట్రిక్ వార్షిక బ్యాటరీ స్టోరేజ్ వినియోగం రాబోయే కొన్నేళ్లలో 5 గిగావాట్ అవర్‌కు పెరుగుతుందని భావిస్తున్నట్టు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. భారత్ ఎనర్జీ కొరతను ఎదుర్కోవడం జరగదు, ఎనర్జీ స్టోరేజ్ అవకాశాలను అందిపుచ్చుకుంటుందని ఓలా ఎలక్ట్రిక్ ఛైర్మన్ భవిష్ అగర్వాల్ అన్నారు. ‘ఓలా శక్తి’ పూర్తిగా స్వదేశీ రూపకల్పన. స్థానికంగా ఇంజనీరింగ్, తయారీ ద్వారా తెచ్చిన మొట్టమొదటి బీఈఎస్ఎస్ అని ఆయన పేర్కొన్నారు.

ధరల వివరాలు

ఓలా శక్తి 1.5 కిలోవాట్ అవర్, 3 కిలోవాట్ అవర్, 5.2 కిలోవాట్ అవర్, 9.1 కిలోవాట్ అవర్ సామర్థ్యాలతో లభిస్తుంది. మొదటి 10,000 యూనిట్లకు ప్రారంభ ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. గురువారం నుంచే రూ. 999 చెల్లించి బుకింగ్ చేసుకునే సదుపాయం ప్రారంభించింది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.

1.5 కిలోవాట్ అవర్ – రూ. 29,999

3 కిలోవాట్ అవర్ – రూ. 55,999

5.2 కిలోవాట్ అవర్ – రూ. 1,19,999

9.1 కిలోవాట్ అవర్ – రూ. 1,59,999 

Leave a Comment