IPL 2026 Auction Venue: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన వేలం త్వరలోనే జరగనుంది. ఈ వేలం వేదిక గురించి తాజాగా ఒక పెద్ద అప్‌డేట్ బయటికొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా విదేశాల్లో (దుబాయ్, జెడ్డా) వేలం నిర్వహించిన బీసీసీఐ, ఈసారి తిరిగి భారత్‌లోనే ఆక్షన్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా ఐపీఎల్‌పై ఆసక్తి చూపిన నేపథ్యంలో గతంలో వేదికలను విదేశాలకు తరలించారు.. కానీ ఇప్పుడు తిరిగి భారత్‌లో వేలం జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌ను భారతదేశంలోనే నిర్వహిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రిక్‌బజ్ నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ 2026 ఆక్షన్ తేదీలు లేదా వేదికకు సంబంధించిన అధికారిక వివరాలను విడుదల చేయలేదు. అయితే, ఈ వేలం డిసెంబర్ 13 నుంచి 15వ తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గత సంవత్సరం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించింది.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు వేలాన్ని అత్యధికంగా హోస్ట్ చేసిన నగరం బెంగళూరు. ఈ నగరం ఏకంగా 7 సార్లు ఐపీఎల్ ఆక్షన్‌ను నిర్వహించింది. ఆ తర్వాత చెన్నై 3 సార్లు హోస్ట్ చేసింది. అయితే, గత కొన్నేళ్లుగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ వచ్చిన తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు లీగ్‌లో చేరినప్పటి నుంచి జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లలో మూడు ఫైనల్స్ అహ్మదాబాద్‌లోనే ఆడారు. అందువల్ల ఈసారి 2026 మినీ ఆక్షన్‌ను అహ్మదాబాద్ హోస్ట్ చేసే అవకాశం ఉంది. భారత్‌లో చివరిసారిగా 2023లో కోచి నగరం ఐపీఎల్ వేలాన్ని నిర్వహించింది.
ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి చివరి తేదీగా నవంబర్ 15 ను నిర్ణయించే అవకాశం ఉంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కొంతమంది కీలక ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేరు గత కొద్ది నెలలుగా జట్టు నుంచి విడుదల అయ్యే ఆటగాళ్ల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..