IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఎదగడానికి ఈ లీగ్ ప్రధాన కారణం. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఐపీఎల్ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ వస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం కొత్త శిఖరాలను తాకుతున్న ఈ టీ20 లీగ్ ఖ్యాతికి తాజాగా వచ్చిన ఒక నివేదికతో పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే ఐపీఎల్ బ్రాండ్ విలువ గణనీయంగా తగ్గింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ విలువలో ఈ ఏడాది భారీగా క్షీణత నమోదైంది. గత సంవత్సరం కంటే ఈసారి ఏకంగా 8 శాతం మేర బ్రాండ్ విలువ తగ్గింది. గత సంవత్సరం ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ.82,700 కోట్లుగా ఉండగా, తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం అది రూ.76,100 కోట్లకు పడిపోయింది. వార్షిక మూల్యాంకన నివేదికను విడుదల చేసే డీడీ అండ్ అడ్వైజరీ ప్రకారం.. ఐపీఎల్ విలువ తగ్గడం ఇది వరుసగా రెండో సంవత్సరం. 2023లో దీని విలువ రూ. 92,500 కోట్లుగా ఉండేది.
ఐపీఎల్‌కు ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగలడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని బియాండ్ 22 యార్డ్స్ నివేదిక వెల్లడించింది.
బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల విలీనం: 2024లో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడంతో మీడియా హక్కుల కోసం పోటీ తగ్గింది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ విలువపై ప్రభావం పడింది.
రియల్ మనీ గేమింగ్ యాప్స్‌పై నిషేధం: భారత ప్రభుత్వం ఈ ఏడాది రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించింది. ఐపీఎల్‌కు స్పాన్సర్లుగా ఉన్న అనేక కంపెనీలు ఈ రంగానికి చెందినవే కావడంతో లీగ్ ఆదాయ వనరులకు గండి పడింది.
ఐపీఎల్ వ్యవస్థకు రూ. 16,400 కోట్ల దెబ్బ
ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఐపీఎల్ ఎకోసిస్టమ్ విలువ భారీగా పడిపోయింది. 2023లో రూ. 92,500 కోట్లుగా ఉన్న లీగ్ విలువ, ప్రస్తుతం రూ. 76,100 కోట్లకు చేరుకోవడంతో.. ఐపీఎల్ వ్యవస్థ దాదాపు రూ. 16,400 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఒక పండుగలాంటిది. రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశం కోసం ఆడే ఆటగాళ్లు ఒకరితో ఒకరు తలపడటం ప్రత్యేకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ లీగ్ విలువ పతనం భారత క్రికెట్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..