
షుగర్ ఉన్నవాళ్లు ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా చాలా భయపడతారు. ఎందుకంటే తిండిలో తేడా వస్తే షుగర్ లెవెల్స్ వెంటనే మారిపోతాయి. ముఖ్యంగా చాలా మందికి పాలు సురక్షితమేనా..? పాలు తాగితే షుగర్ పెరుగుతుందా..? అనే డౌట్లు ఉంటాయి. నిజానికి డయాబెటిక్ రోగులకు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడం ఎంత ముఖ్యమో.. వారి ఆహారంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి పాలు ఉత్తమమైన ఆహారంగా చెబుతారు. పాలు తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయనే గందరగోళం కారణంగా చాలా మంది పాలు తాగడానికి భయపడతారు.
గ్లైసెమిక్ లోడ్ తక్కువ
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు తాగితే చక్కెర స్థాయిలు పెరుగుతాయనేది కేవలం అపోహ మాత్రమే. 500 ml పాలలో గ్లైసెమిక్ లోడ్ కేవలం 7.5 మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఎక్కువ కాదు. పాల గ్లైసెమిక్ ఇండెక్స్ 27 నుండి 34 వరకు ఉంటుంది. ఇది చాలా తక్కువగా చెబుతారు. పాలు తాగడం వల్ల డయాబెటిస్ రాదు. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నప్పటికీ, చక్కెర కలపకుండా పాలు తాగితే ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఎలాంటి పాలు తాగవచ్చు..?
చాలా మంది వైద్యులు మధుమేహ రోగులకు కొవ్వు తక్కువగా ఉండే స్కిమ్డ్ లేదా టోన్డ్ పాలు తాగమని సలహా ఇస్తారు. కానీ డయాబెటిస్ రోగులు పరిమిత పరిమాణంలో ఫుల్ క్రీమ్ పాలు కూడా తాగవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫుల్ క్రీమ్ పాలలో గుండెను రక్షించే పరిమిత కొవ్వు ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు ఫుల్ క్రీమ్ పాలు తాగడం వల్ల కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు.
పోషకాల నిధి
పాలల్లో గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2, విటమిన్ B12, పొటాషియం, పాస్పరస్, అయోడిన్ వంటి పోషకాలు శరీరానికి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మధుమేహ రోగులు పాలు తాగడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే పాలు తాగేటప్పుడు వాటిలో చక్కెర లేదా ఇతర స్వీటెనర్‌లు కలపకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ శరీర పరిస్థితిని బట్టి ఎంత పాలు తీసుకోవాలో తెలుసుకోవడానికి మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
[