BC reservations: మంత్రులు ఢిల్లీకి వెళ్లిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. న్యాయ నిపుణులతో మాట్లాడారు. గంటలకొద్ది చర్చలు జరిపారు. బీసీ నాయకులతో మాట్లాడారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. కాంగ్రెస్ కోరుకున్న ప్రయోజనం దక్కలేదు. హైదరాబాదులోనే కాదు హస్తినలో కూడా రిక్తహస్తం మిగిలింది. ఇప్పుడు ఇంతటి పరాభవం జరిగిన తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుంది? రేవంత్ మనసులో ఏముంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణలో వినిపిస్తున్నాయి.
వాస్తవానికి బీసీలను రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. వారిని ఓటు వేసే యంత్రాలు గానే చూస్తున్నాయి. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభలో బిల్లు ఏర్పాటు చేసి గవర్నర్ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. పైగా హైకోర్టు స్టే కూడా విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా అదే ఫలితం రావడంతో ప్రభుత్వానికి తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి మనదేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు అనే నిబంధన ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇక తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటన గొప్పగా ఉన్నప్పటికీ ఆచరణ మాత్రం ఆ స్థాయిలో లేదు. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తే చట్ట పరంగా ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం ముందుగా అంచనా వేయలేకపోయింది. అందువల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. కానీ ఎప్పుడైతే హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందో.. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా అదే ఫలితం రావడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర లభించకపోతే పార్టీపరంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారని తెలుస్తోంది. దీనిపై కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆల్రెడీ కౌంటర్ మొదలుపెట్టింది. బీసీలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శిస్తోంది. భారత రాష్ట్ర సమితి విమర్శలకు సరైన స్థాయిలో సమాధానం చెప్పాలంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం మాత్రమే రేవంత్ రెడ్డి ముందున్న మార్గం. అయితే ఆ ఆలోచనకు మంత్రివర్గం ఒకే చెబుతుందా.. మిగతా సామాజిక వర్గాలు స్వాగతిస్తాయా.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.