Andhra Jyothy Newspaper: ఈ రోజుల్లో న్యూట్రల్ మీడియా అనేది లేదు.. అసలు మీడియాలో న్యూట్రల్ అనే పదమే ఒక బూతు.. ప్రతి పార్టీ సొంత మీడియా సంస్థను కలిగి ఉంది. పరోక్ష బంధాలను ఆయా మీడియా సంస్థలతో కొనసాగిస్తోంది. తెలుగులో ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు తమిళనాడును మించిపోయింది. తమిళనాడులో కూడా ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థ ఉంటుంది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్, వెబ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మీడియా సంస్థలు ఆయా పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా అదే ధోరణి కనిపిస్తోంది.. అంతేకాదు రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను కొనసాగించడం ప్రాథమిక అనివార్యతగా గుర్తించాయి.
అధికారంలో ఉన్నప్పుడు అనుకూల మీడియా సంస్థలు భారీగా దండుకుంటాయి. ఏ బి సి, టిఆర్పి లతో సంబంధం లేకుండా కోట్లకు కోట్లు ప్రకటనలను అచ్చు వేసుకుంటాయి. ఇందులో ఈ మీడియా సంస్థ సుద్దపూస అని.. ఆ మీడియా సంస్థ దుర్మార్గమని చెప్పడానికి లేదు. అన్ని కూడా ఆ తానులో ముక్కలే. కాకపోతే తమకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటే ఒక విధంగా.. అనుకూలంగా లేకపోతే మరొక విధంగా ఆ మీడియా సంస్థలు వ్యవహరిస్తుంటాయి.
ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి అనుకూల పత్రికగా పేరుపొందింది. ఇదే విషయాన్ని వైసిపి పదే పదే ప్రస్తావిస్తుంటుంది. పైగా ఆంధ్రజ్యోతి పేరును చెప్పకుండా తోక పత్రిక అంటూ విమర్శిస్తుంది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా సాక్షి పేరును ప్రస్తావించకుండా జగన్ మీడియా అంటూ సంబోధిస్తుంది. ఈ యుద్ధం ఎప్పటి నుంచో ఉన్నది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆంధ్రజ్యోతికి పంట పండుతోంది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రిక 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఏబీఎన్ కూడా 16వ పడిలోకి అడుగు పెట్టింది. సహజంగా వార్షికోత్సవాన్ని కమర్షియల్ గా మార్చింది తెలుగు పాత్రికేయంలో వార్త పత్రికే.. అది వేసిన అడుగులను మిగతా పత్రికలు పాటిస్తున్నాయి. అయితే ఇందులో ఈనాడుకు కాస్త మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాల్టికి కూడా రిపోర్టర్లకు యాడ్ టార్గెట్ ఇవ్వకుండా.. కేవలం వార్తలు విషయంలో మాత్రమే ఈనాడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఏపీలో అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతికి ప్రకటనల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆంధ్రజ్యోతి పత్రికకు బీభత్సమైన యాడ్ ఇచ్చేసింది.. విజయవాడ ఎడిషన్ లోని జోన్ పేజీలో సగానికంటే ఎక్కువ యాడ్ ప్రచురించింది. ఇందులో వేమూరి రాధాకృష్ణ ఫోటో అతిపెద్దగా.. పైగా అభిమాన ఆంధ్రజ్యోతి అంటూ మెచ్చుకోలు అక్షరాలతో తన ఇష్టాన్ని ప్రదర్శించింది. వేమూరి రాధాకృష్ణ ఫోటోలు అతిపెద్దగా.. చంద్రబాబు, స్టాంపుల శాఖను పర్యవేక్షించే మంత్రి ఫోటోలను చిన్నగా ప్రచురించారు. వాస్తవానికి రాధాకృష్ణ ఫోటో అతిపెద్దగా వేసి తమ అభిమానాన్ని చాటుకుని.. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి ఫోటోలను చిన్నగా వేయడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎలాగు ఆంధ్రజ్యోతి తమ అభిమాన పత్రిక కాబట్టి ఇలా అభిమానాన్ని చూపించారా.. లేక ఎవరో యాడ్ ఇచ్చి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పేరు పెట్టారా.. పైగా యాడ్ మధ్యలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక భూమి ఫోటోను కూడా పెట్టారు. వాస్తవానికి ఇదంతా చూస్తుంటే కాస్త చిత్రంగానూ.. మరింత ఆశ్చర్యంగానూ అనిపిస్తోంది. హవాలా, బ్లాక్ మనీ, అని పేపర్లలో వార్తలు వస్తుంటాయి. వాటికి మించిపోయే విధంగా మీడియాలోనే అటువంటి పనులు సాగిపోతుంటాయి. వాటికి బలమైన ఉదాహరణ ఇటువంటి ప్రకటనలే..
