నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపైఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తాజాగా స్పందించింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా.. ఈ రెండే మా ఇంధన విధానంలోని ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం’ అని తెలిపారు.
The post రష్యా చమురు కొనుగోలు: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్ appeared first on Navatelangana.