మన తెలంగాణ/పేట్ బషీరాబాద్: దూలపల్లిలోని చైనా బజార్ సమీపంలో ఉన్న క్రౌన్ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం.. ప్లాస్టిక్ కవర్లు, ఇతర ఉత్పత్తులు తయారు చేసే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మంటల కారణంగా కంపెనీ ప్రాంగణం మొత్తం పొగ మబ్బులు కమ్ముకున్నాయి. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంటల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాదానికి గల కారణాలను వెల్లడించనున్నారు.