తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసుబాటు కల్పిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందాక మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డి తెలిపారు. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై అక్టోబర్ 23వ తేదీన నిర్వహించే కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతున్న సందర్భంగా విజయోత్సవాలకు ప్లాన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రజాపాలన ఉత్సవాలకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది.
అలాగే, రాష్ట్రంలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. నల్సార్ వర్సిటీలో నల్సార్ వర్సిటీకి అదనంగా 7 ఎకరాల భూమి కేటాయించిన రాష్ట్ర సర్కార్.. స్థానిక విద్యార్థులకు 50శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్‌యార్డ్‌కు భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం కొనుగోలు చేసినా.. చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించింది. ఇక హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్దికి నిధులు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5,566 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రోడ్లను రూ.10,547 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపారు. ఇక కృష్ణా- వికారాబాద్ రైలుమార్గం కోసం భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయం రాష్ట్రం భరించేందుకు ఆమోదం లభించింది. ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి రక్షణశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..