చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. 10 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు

మహిళల వన్డే వరల్డ్‌కప్.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా

విశాఖపట్నం: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా నాలుగింటిలో విజయం సాధించింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ నేపథ్యంలో 9 పాయింట్లతో ఆస్ట్రేలియా నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అలీసా హీలీ, ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. హీలీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించింది. బంగ్లా బౌలర్లను హడలెత్తించిన అలీసా వరుస ఫోర్లతో పరుగుల వరదను పారించింది. లిచ్‌ఫీల్డ్ కూడా తన మార్క్ షాట్లతో చెలరేగి పోయింది. ఈ జోడీని కట్టడి చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హీల 77 బంతుల్లోనే 20 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు సాధించింది. చూడచక్కని షాట్లతో అలరించిన హీలీ కళ్లు చెదిరే శతకంతో జట్టుకు ఘన విజయం అందించింది. లిచ్‌ఫీల్డ్ కూడా తనవంతు సహకారం అందించింది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 72 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 84 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా సగానికి పైగా ఓవర్లు మిగిలివుండగానే జయకేతనం ఎగుర వేసింది.

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. సమష్టిగా రాణించిన బౌలర్లు ఏ దశలోనూ బంగ్లా బ్యాటర్లకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అలనా కింగ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచింది. 10 ఓవర్లలో 4 మెయిడిన్‌లతో 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టింది. జార్జియా వెరెహమ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి తనవంతు పాత్ర పోషించింది. జార్జియాకు కూడా రెండు వికెట్లు దక్కాయి. మిగతా బౌలర్లలో సదర్లాండ్, గార్డ్‌నర్‌లు చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు. బంగ్లా టీమ్‌లో శోభన మోస్టరి అజేయంగా 66 పరుగులు చేసింది. ఓపెనర్ రాబ్యా హైదర్ (44) పరుగులతో తనవంతు పాత్ర పోషించింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లా ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేక పోయింది.

Leave a Comment