కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం ప్రధాని మోదీ కర్నూలు నుంచి సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ సందర్శన తర్వాత, సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న సుమారు రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
శ్రీశైలం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రధాని తిరిగి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జీఎస్టీ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం, సాయంత్రం 4:45 గంటలకు కర్నూలు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.