అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను జన్మించానని, విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశిస్సులు పొందానని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని కొనియాడారు. సైన్స్,ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఎపిలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ కు సరైన విజన్.. సరైన నాయకత్వం అవసరం ఉందని, ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ రూపంలో ఎపికి శక్తివంతమైన నాయకత్వం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని, 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మోడీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని ప్రశంసించారు. 2047 నాటికి మన దేశం.. వికసిత్ భారత్ గా మారుతుందని, 21 శతాబ్దం, 140 కోట్ల భారతీయుల శతాబ్దం అని ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమని అన్నారు. ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగిందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని, ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోందని మోడీ స్పష్టం చేశారు.