ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై కర్ణాటక కీలక నిర్ణయం

బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమనిబంధనలు తీసుకురావలని నిర్ణయించింది. ‘మేము ఏ సంస్థను నియంత్రించలేము. కానీ ఇకపై బహిరంగ ప్రదేశాలలో లేదా రోడ్లపై మీకిష్టమున్నట్లు చేయలేరు. మీరు ఏది చేయాలన్నా అది ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులతో అన్నారు.

రాష్ట్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, బయోటెక్నాలజీ మంత్రి అయిన ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు, దాని అనుబంధ సంస్థలపై నిషేధం కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల నుంచి ఆయనకు ఇటీవలే చావు బెదిరింపులు అందాయన్నది ఇక్కడ గమనార్హం.

బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడమో లేక నిషేధించడమో చేయాల్సింది ఇక ప్రభుత్వం చేతిలోనే ఉందని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ‘అధికారులకు సమాచారం ఇచ్చేసి కర్రలు చేతపట్టుకుని మీరు రోడ్లపై కవాతులు చేస్తూ ‘పథ సంచలన’(మార్చ్) చేయలేరు. మేము ప్రవేశపెట్టే నియమాలకు లోబడే మీ కార్యక్రమాలుండాలి’ అని ఆయన తెలిపారు.

‘ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, అనుబంధ సంస్థలకు సంబంధించిన నియమాలను మేము తేవాలనుకుంటున్నాము. హోం శాఖ, న్యాయ శాఖ, విద్యా శాఖ జారీచేసిన మునుపటి ఆదేశాలను ఒకచోట చేర్చి కొత్త నియమాలను రూపొందిస్తాము. రాబోయే రెండు, మూడు రోజుల్లో చట్టం, రాజ్యాంగం చట్రంలో కొత్త నియమం అమలులోకి రాగలదు’ అని ప్రియాంక్ ఖర్గే క్యాబినెట్ సమావేశం తర్వాత అన్నారు.

Leave a Comment