వాకింగ్ చేస్తుండగా మహిళ గొంతుకోసి… | Akkayapalem Andhra Pradesh

విశాఖపట్నం: వాకింగ్‌కు వెళ్లిన వివాహిత గొంతు కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కయపాలెం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెక్కుడు రాయి కాలనీలో శ్రావణ సంధ్య(30) అనే మహిళ నివసిస్తోంది. భర్తతో గొడవలు రావడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఆమె వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడిని హాస్టల్‌లో ఉంచి చదవిస్తుండగా చిన్న కుమారుడికి మతిస్థిమితం లేకపోవడంతో తన దగ్గరే ఉంచుకుంటుంది. చిన్న కుమారుడికి వచ్చిన పెన్షన్ డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. ఇంటికి సమీపంలో కార్పెంటర్ శ్రీనుతో ఆమెకు గొడవలు ఉన్నాయి. శ్రీను ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. ఇటీవల అతడిని గట్టిగా మందలించడంతో ఆమెపై అతడు కక్ష పెంచుకొని పగతో రగిలిపోతున్నాడు. బుధవారం సాయంత్రం సంధ్య వాకింగ్‌కు వెళ్లింది. అదే సమయంలో శ్రీను ఫుల్‌గా మద్యం తాగి కత్తితో ఆమె పీక కోశాడు. అనంతరం అతడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Comment