YSRCP Latest News: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది. 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే పనిలో పడింది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతంపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం అక్కడ వై వి సుబ్బారెడ్డి ఒక్కరే ఎదురిదుతున్నారు. ఆయనకు కనీస స్థాయిలో కూడా సాయం చేసే నేత లేకపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడం వంటి కారణాలతో వైవి సుబ్బారెడ్డి ఒక్కరయ్యారు. ఇంకోవైపు కరణం బలరాం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ అయిన నాయకుడి అవసరం ఏర్పడింది. ఆ జిల్లాలో పార్టీకి ఊపు తెచ్చే నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నా..
2024 ఎన్నికల కు ముందు అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్( amanchi Krishna Mohan ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల అసెంబ్లీ స్థానాన్ని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు కృష్ణ మోహన్. వెంటనే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోవడం చీరాలలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా క్రియాశీలకంగా లేరు. మరో పార్టీలో చేరే చాన్స్ లేదు. అందుకే ఆయన చూపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం నుంచి సానుకూలత రావడంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
జిల్లాలో పట్టున్న నేత
ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో( Prakasam district) పట్టున్న నేత. గతంలో చీరాల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అయితే జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో టిడిపి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఐదేళ్లపాటు అధికార టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆయనపై పోటీ చేసిన కరణం బలరాం గెలిచారు. అయితే అక్కడికి కొద్ది కాలానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు కరణం బలరాం. అప్పటినుంచి ఆమంచి కృష్ణమోహన్ లో అసంతృప్తి పెరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో బయటకు వచ్చేసారు.
ఉభయులకు అవసరం..
అయితే ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సరైన నాయకుడు లేరు. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ కు కూటమి పార్టీల్లో అవకాశం దక్కేలా లేదు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ అవుతారని ప్రచారం నడుస్తోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరిపోతారని.. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.