Trade Deficit: 11 నెలల గరిష్ట స్థాయికి చేరిన వాణిజ్య లోటు

Trade Deficit: 11 నెలల గరిష్ట స్థాయికి చేరిన వాణిజ్య లోటు

దిశ, బిజినెస్ బ్యూరో: ఆగస్టు ఆఖరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను 50 శాతానికి పెంచడంతో మనదేశ ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరిగాయి. ఫలితంగా భారత వాణిజ్య లోటు సెప్టెంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయి 32.15 బిలియన్ డాలర్ల(రూ. 2.83 లక్షల కోట్ల)కు పెరిగాయని బుధవారం ప్రభుత్వ డేటా వెల్లడించింది. అమెరికా టారిఫ్ పెంపు కారణంగా దుస్తులు, రొయ్యలు, రత్నాభరణాలు వంటి భారతీయ వస్తువుల ఎగుమతులు ప్రభావితమయ్యాయి. అయినప్పటికీ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎగుమతులు ఆగస్టులో 35.10 బిలియన్ డాలర్ల(రూ. 3.09 లక్షల కోట్ల) నుంచి 36.38 బిలియన్ డాలర్ల(రూ. 3.20 లక్షల కోట్ల)కు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. వస్తువుల దిగుమతులు సెప్టెంబర్‌లో 68.53 బిలియన్ డాలర్ల(రూ. 6.03 లక్షల కోట్ల)కు పెరిగాయి, అంతకుముందు నెలలో ఇవి 61.59 బిలియన్ డాలర్లు(రూ. 5.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి. ఈ వారంలో అమెరికాతో జరిగే వాణిజ్య చర్చలపై సానుకూల సంకేతాలు పెరుగుతున్న వేళ ఈ డేటా వచ్చింది. రష్యా చమురు కొనుగోళ్లపై ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో భారత్ అమెరికా ఇంధన దిగుమతులను పెంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Comment