Mallojula Venugopal Rao: మావోయిస్టు విప్లవోద్యమ చరిత్రలో దాదాపుగా ఒక శకం ముగిసినట్టే. మావోయిస్టు దళంలో కీలక నాయకుడిగా పని చేసిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆయుధాన్ని పక్కన పెట్టారు. ఇన్ని రోజులపాటు అడవిలో అన్నగా వెలుగొంది న అతడు ఇకపై జనజీవన స్రవంతిలో కనిపించబోతున్నాడు. దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, బీహార్ రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో తలదాచుకుని.. సమాంతర ప్రభుత్వాలు నిర్వహించిన అతడు.. ఇకపై సెలవంటూ ఆయుధాన్ని వదిలిపెట్టాడు. ఉద్యమం ఎక్కడుందో.. అక్కడే నీ కూడు ఉందని నినాదాలు చేసిన అతడు.. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
మల్లోజుల వేణుగోపాలరావు దాదాపు 40 సంవత్సరాలపాటు పోరాటం చేశాడు. దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని ఉద్యమాలు చేశాడు. ఎన్నో హింసాత్మక ఘటనలలో పాలుపంచుకున్నాడు. సాధారణ మావోయిస్టుగా దళంలోకి ప్రవేశించిన అతడు దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. ఏకంగా కేంద్ర కమిటీ ని శాసించే స్థాయికి ఎదిగాడు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతడు ఏటూరు నాగారం దళసభ్యుడిగా ఆయుధాన్ని చేత పట్టుకున్నాడు. పార్టీలో అంతకంతకు విరిగిపోయాడు. 1983లో డికేస్ జడ్పీ సభ్యుడిగా.. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా.. 2005లో పొలిటి బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. గడచిన నాలుగు దశాబ్దల కాలంలో ఎన్నో హింసాత్మక ఘటనలలో పాలుపంచుకున్నాడు.. రాష్ట్ర పోలీసులకు, కేంద్ర దళాలకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు.
ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగా ఎంతోమంది మావోయిస్టులను అంతం చేసింది. దట్టమైన అడవులలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. మావోయిస్టులకు పట్టు ఉన్న ప్రాంతాలలో కేంద్ర బలగాలు విస్తృతంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో వారికి ఆవాసం అనేది లేకుండా పోయింది. దీంతో మావోయిస్టులు తుపాకులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇటీవల హిడ్మా పేరుతో ఒక లేఖ విడుదలైంది. తుపాకులను వదిలిపెడతామని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నాడు. దీనిపై మావోయిస్టులలో భిన్న స్వరాలు వినిపించాయి. మావోయిస్టు సానుభూతిపరులు కూడా హిడ్మా లేఖను తప్పు పట్టారు. దీంతో మావోయిస్టులు తుపాకులను పక్కన పెట్టడం సాధ్యం కాదని అర్థమయిపోయింది. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్ రావు 60 మంది దళసభ్యులతో లొంగిపోతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వేణుగోపాలరావు తన 60 మంది దళ సభ్యులతో కలిసి లొంగి పోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో మావోయిస్టు ఉద్యమానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఇకపై జనజీవన స్రవంతిలో కలుస్తారని తెలుస్తోంది. కేంద్రం కూడా మావోయిస్టులతో శాంతి చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అటు కేంద్ర బలగాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఊపిరి ఆడని పరిస్థితి మావోయిస్టులకు ఏర్పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మావోయిస్టులు తుపాకులను పక్కన పెడుతున్నారు. వేణుగోపాలరావు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత.. ప్రజా సమస్యల పరిష్కారానికి వేరే విధమైన ఉద్యమాలను చేపడతామని పేర్కొన్నారు. కాకపోతే అది శాంతియుత విధానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.