జూబ్లీ హిల్స్‌లో ఎన్నికల హడావిడి మరింతగా పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయగా.. ఇవాళ బీజేపీ కూడా తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ నాయకత్వం. సర్వేల ఆధారంగానే పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని భావిస్తున్నట్టు లంకల దీపక్ రెడ్డి చెప్పారు. గత పదేళ్లు జూబ్లీహిల్స్‌కు మాగంటి గోపీనాథ్ చేసిందేమీ లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు.
నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత
జూబ్లీహిల్స్ BRS అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో సునీత నామినేషన్ వేశారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కేటీఆర్.
జూబ్లీ హిల్స్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్
మరోవైపు జూబ్లీ హిల్స్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్. నవీన్ యాదవ్‌కు మద్దతుగా కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రచారం చేపట్టారు. మరోవైపు మాగంటి సునీతపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి విషయాన్నీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని.. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్, హరీష్‌రావు కలిసి సునీతను ఎన్నికల ప్రచారంలో ఏడ్చేలా చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు.. ఊపందుకోనున్న ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం.. పలువురు అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేయడంతో ఎన్నికల ప్రచారం, రాజకీయం పర్వం మరింత ఊపందుకోనంది.
రూ.10 లక్షలకుపైగా నగదు స్వాధీనం ..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.10 లక్షలకుపైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నాయి. అధికారుల వివరాల ప్రకారం, ఫ్లయింగ్ స్క్వాడ్ 3A బృందం అమీర్‌పేట్ ఎక్స్ రోడ్డులో వాహనాన్ని ఆపి రూ.1.50 లక్షలు స్వాధీనం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ 10A బృందం వెంకటగిరి కాలనీ రోడ్ నెం.2 వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.2.30 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ 6B బృందం మధురానగర్‌లో రూ.6.50 లక్షలు స్వాధీనం చేసింది. స్వాధీనం చేసిన నగదును సంబంధిత పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్లకు అప్పగించారని ఎన్నికల అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..