CM Revanth Reddy And MLA Donthi Madhava Reddy: రాజకీయాలలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవరూ ఊహించలేరు. అటువంటి పరిణామమే బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట లో చోటుచేసుకుంది. ఇక్కడికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి సీతక్క వచ్చారు. వారు వచ్చిన విశేషం కూడా ఆశ్చర్యకరమైనదే. వాస్తవానికి ముఖ్యమంత్రి వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, నాయకులు కూడా నమ్మలేదు.
వాస్తవానికి ముఖ్యమంత్రి వచ్చిన కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి సంబంధించినది. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల కన్నుమూశారు. ఆమె దశదినకర్మ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావడం ఒక ఆశ్చర్యకరమైతే.. దొంతి మాధవరెడ్డి చేతిలో చేయి వేసి ఆయన కార్యకర్తలకు అభివాదం చేయడం మరొక ఆశ్చర్యకరం. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నర్సంపేట నియోజకవర్గం నుంచి దొంతి మాధవరెడ్డి కూడా విజయం సాధించారు. శంషాబాద్ లో నిర్వహించిన సమావేశం మినహా ఇన్ని రోజుల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి పరస్పరం ఎదురు పడలేదు. కనీసం మాట్లాడుకోలేదు. ఆ మధ్య భారీ వర్షాలు వచ్చి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేట నియోజకవర్గం లో నష్టం విపరీతంగా వాటిల్లింది. ఈ సమయంలో వర్షం వల్ల నష్టపోయిన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ దొంతి మాధవరెడ్డి క్యాంపు ఆఫీసు ముందుగానే వెళ్లిపోయింది. అయినప్పటికీ దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రిని కలవడానికి కనీసం ప్రయత్నించలేదు.. దీంతో నర్సంపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదని అభియోగాలు కూడా వినిపించాయి. అయినప్పటికీ దొంతి మాధవరెడ్డి ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు.
గులాబీ అనుకూల మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. నర్సంపేట నియోజకవర్గం నుంచి మాధవరెడ్డిని తప్పిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్నీ కూడా ఊహగానాలు గానే మిగిలిపోయాయి. చివరికి దొంతి మాధవరెడ్డి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని కేసి వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కోరారు. అంతేగాని ముఖ్యమంత్రిని కలవలేదు. అయితే ఇటీవల మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాధవరెడ్డిని పరామర్శించారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో కూడా తెలియదు.. కానీ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం అందింది. కాజీపేటలో జరిగే కాంతమ్మ దశదినకర్మకు హాజరవుతారని ఆ సమాచారం సారాంశం. వాస్తవానికి ఈ విషయాన్ని మాధవరెడ్డి అనుచరులు కూడా నమ్మలేదు. కాని చివరికి ముఖ్యమంత్రి వచ్చారు. మాధవరెడ్డి చేతిలో చేయి వేశారు. కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మాధవరెడ్డి వర్తమానం పంపారా? రేవంత్ రెడ్డి కావాలని వచ్చారా? ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా మాటలు లేని శత్రుత్వం కొనసాగిన వేళ.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. వాటన్నింటికీ రేవంత్ చెక్ పెట్టారు. మాధవరెడ్డి స్నేహస్తం చాచారు. ఇక ఇప్పుడు నర్సంపేటలో అభివృద్ధి పట్టాలు ఎక్కుతుంది. డబుల్ స్పీడ్ వేగంతో పరుగులు పెడుతుంది.