ఏపీలో నకిలీ మద్యం నివారణకు నిబంధనలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరింత కఠినం చేసింది. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌లో స్కాన్ చేశాకే మద్యాన్ని విక్రయించాలన్న నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రతి షాప్, బార్ ముందు బోర్డులు పెట్టాలని నిర్దేశించింది. తనిఖీల వివరాల నమోదుకు రిజిస్టర్ ఏర్పాటు సహా అబ్కారీ శాఖ అధికారులు రోజూ సంతకం చేయాలనే నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం సరికొత్త కంట్రోల్ రూం, వాట్సప్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
మద్యం బాటిల్స్‌పై సీల్, మూత, హోలోగ్రామ్‌ను తనిఖీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యూన్‌నెస్ వెరిఫికేషన్ రిజిష్టర్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్, రిజిష్టర్‌లో నమోదు చేయాలని తెలిపింది.
QR తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని సూచించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా ఆ వివరాలను రియల్-టైమ్ డేటాలో ప్రదర్శించాలని నిబంధనల్లో తెలిపింది. ఇక తనిఖీల్లో నకిలీ మద్యం దొరికితే తక్షణమే లైసెన్స్ రద్దు చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..