రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు – Telugu News | Vijayawada ACB court sensational verdict after 13 years of trial in Rs. 1500 bribery case

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి విజయవాడ ఏసీబీ కోర్టు తగిన శిక్ష విధించింది. 13 ఏళ్ల పాటు విచారణ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట చెందిన కె. వెంకట నాగ బాబు ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లో ఏసీ, కూలర్ రిపేర్ చేసినందుకు బిల్లులు ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వ జనరల్ హాస్పటల్ సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు.

ఈ బిల్లుల మొత్తం మంజూరు చేసేందుకు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) టి.శంకరరావు రూ. 1500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీ మెకానిక్ నాగబాబు విజయవాడ రెంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో 2013లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 20-03-2013 నాడు రూ.1500 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి విజయవాడ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ కోర్టు.. లంచం తీసుకున్నందుకు ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) శంకరరావుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6,000 జరిమానాగా విధించింది. రూ. 1500 కోసం అత్యాశకు పోయి కేసులో ఇరుక్కుని జైలు శిక్ష పడటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండిలకు ఇదొక హెచ్చరిక అంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment