
దిశ, వెబ్‌డెస్క్: కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా పని చేస్తున్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఓఎస్డీ సుమంత్ (Sumanth)ను విధుల నుంచి తప్పించి రెండు రోజులు గడవక ముందే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ రాత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. అయితే, ఇంట్లోనే ఉన్న కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారికి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుమంత్‌కు అరెస్ట్‌కు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్పా.. అని ప్రశ్నించారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఓ వ్యక్తికి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో రివాల్వర్ పెట్టి సుమంత్ బెదిరించినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. ఇదే విషయంలో తాము మంత్రి ఉత్తమ్‌కు ఫోన్ చేస్తే.. తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, ప్రభుత్వ పెద్దలు స్పీచులు దంచుతున్నారని, కానీ మా అమ్మపై.. బీసీ బిడ్డ అని కూడా చూడకుండా అందరూ కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇన్వాల్‌మెంట్ ఉందని సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉండగానే.. కొండా సురేఖ తన కారులో సుమంత్‌ను వెంట పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లిపోవడం కొసమెరుపు.