మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. మోడీ సంతాపం

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన స్వస్థలం ఖడ్పబంద్‌లో మంత్రి రవి నాయక్‌ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని పోండాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఖడ్పబంద్‌లోని నివాసానికి తరలించారు. రవి నాయక్‌కు నేతలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఆక్ష్నకు భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

రవి నాయక్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు సంతాపం తెలియజేశారు. ‘‘గోవా మంత్రి రవినాయక్ ఆకస్మిక మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసినందుకు, అంకితభావంతో ప్రజలకు సేవ చేసిందుకు ఆయన్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించంలో ఆయన ఎంతో ఆసక్తి చూపించే వారు. ఓం శాంతి’’ అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

Leave a Comment