భారత్ హెల్ప్ కావాలి: అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్ : రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఓ వైపు భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా, చైనా విషయంలో మాత్రం మన సాయం కోరుతోంది. అరుదైన ఖనిజాలపై బీజింగ్ నియంత్రణను ఎదుర్కొనేందుకు భారత్, ఐరోపా మద్దతు కావాలని ఆశిస్తోంది. ఈమేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై తాజాగా స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్‌పై ఆయన విమర్శలు చేశారు.

“ఇది చైనాకు , ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురి పెట్టింది. మేం అలా జరగనివ్వం. బీజింగ్ దూకుడును మేం అడ్డుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే మిత్ర దేశాలను సంప్రదిస్తున్నాం. చైనాను ఎదుర్కొనేందుకు మాకు భారత్, ఐరోపా దేశాల మద్దతు కావాలి ” అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అమెరికా మంత్రి వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

Leave a Comment