నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రెండు నామినేషన్ సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భారీ ర్యాలీకి, రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి 100 మీటర్ల వరకు ఆంక్షలను ఆర్‌ఓ సాయిబాబా అమలు చేస్తున్నారు.

షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన సందర్భంలో మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థితో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్‌లు, శ్రీధర్‌రెడ్డి, వెంగళరావు నగర్ కార్పోరేటర్ దేదీప్య ఉన్నారు. నామినేషన్ రెండో సెట్ దాఖలు చేయు సందర్భంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్‌రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పోరేటర్ రాజ్‌పటేల్‌లు పాల్గొన్నారు.

10 మంది 13 నామినేషన్లు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు మూడో రోజు 10 మంది 13 సెట్లుగా తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజుల్లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 30 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Comment