4 రోజుల మ్యాచ్‌లు ఆడుతుంటే, వన్డేలు ఆడలేనా..?: సెలెక్టర్లను ఏకిపారేసిన టీమిండియా పేసర్ – Telugu News | If I Can Play 4 Dayers, I Can Play ODIs says Mohammed Shami over BCCI Selectors

Mohammed Shami: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్టర్లపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు ఆడటంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశాడు.

గాయాలతో సతమతమవుతున్న షమీ, 2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని, జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందాడు. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.

బెంగాల్ తరపున ఉత్తరాఖండ్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, షమీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. “సెలెక్షన్ నా చేతుల్లో లేదు. ఒకవేళ నాలో ఫిట్‌నెస్ సమస్య ఉంటే, నేను ఇక్కడ బెంగాల్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉండేవాడిని కాదు,” అని అన్నాడు. “ఈ విషయంపై నేను మాట్లాడి వివాదం సృష్టించదలుచుకోలేదు. కానీ, నేను నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడగలిగినప్పుడు, 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను,” అని తన సామర్థ్యంపై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

తన ఫిట్‌నెస్‌ గురించి సెలెక్టర్లకు నివేదికలు ఇవ్వడం తన బాధ్యత కాదని షమీ తేల్చి చెప్పాడు. “నా ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇవ్వడం నా బాధ్యత కాదు. నా పని ఎన్‌సీఏకి వెళ్లి, సిద్ధమై, మ్యాచ్‌లు ఆడటమే. వారికి ఎవరు అప్‌డేట్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వడం లేదు అనేది వారి విషయం,” అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, షమీ ఫిట్‌నెస్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని గతంలో పేర్కొనడం గమనార్హం. అయితే, షమీ దేశవాళీ క్రికెట్‌లో తన ప్రదర్శన ద్వారానే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

జట్టు ఎంపిక తన చేతుల్లో లేకపోయినా, దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని షమీ తెలిపాడు. “దేశం కోసం అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. దేశం గెలవడం ముఖ్యం. మనమందరం సంతోషంగా ఉండాలి,” అని అన్నాడు.

గాయం నుంచి కోలుకున్న తర్వాత బలమైన పునరాగమనం చేయాలని తాను భావిస్తున్నానని, సెలెక్టర్లు ఎప్పుడు పిలిచినా తాను సిద్ధంగా ఉంటానని షమీ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శన ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవాలని షమీ పట్టుదలగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment