రెండో టెస్టు: వెస్టిండీస్ ఎదురీత.. పట్టుబిగించిన భారత్

న్యూఢిల్లీ: భారత్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో 270 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడక తప్పలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తోంది. ఒక దశలో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న విండీస్‌ను జాన్ కాంప్‌బెల్, షాయ్ హోప్‌లు ఆదుకున్నారు.

ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ విండీస్ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హోప్ 103 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జాన్ కాంప్‌బెల్ 145 బంతుల్లో 9 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు అజేయంగా 138 పరుగులు జోడించారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే విండీస్ మరో 97 పరుగులు చేయాలి.

కుల్దీప్ మ్యాజిక్..

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 140/4తో తొలి ఇన్నింగ్స్ తిరిగి చేపట్టిన విండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. షాయ్ హోప్ ఐదు ఫోర్లతో 36 పరుగులు చేసి కుల్దీప్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (21) కూడా ఔటయ్యాడు. అతన్ని కూడా కుల్దీప్ ఔట్ చేశాడు. అంతేగాక జస్టిన్ గ్రీవ్స్ (17)ను కూడా కుల్దీప్ వెనక్కి పంపాడు. ఖారి పిరె (23)ను బుమ్రా బౌల్డ్ చేయగా, వారికన్ (1)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అండర్సన్ ఫిలిప్ 93 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జైడెన్ సీల్స్ (13)ను కుల్దీప్ ఔట్ చేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ 81.5 ఓవర్లలో 248 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు, జడేజా మూడు, సిరాజ్, బుమ్రా ఒక్కొ వికెట్‌ను పడగొట్టారు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Comment