Royal Enfield: ఇప్పుడు అమెజాన్‌లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కొనేయొచ్చు

Royal Enfield: ఇప్పుడు అమెజాన్‌లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కొనేయొచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇటీవల ఈ-కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని 350 సీసీ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లను గత నెలలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించడం ప్రారంభించింది. తాజాగా కంపెనీ తన బైకుల అమ్మకాలను మరింత విస్తరిస్తూ, అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో తన అన్ని 350సీసీ బైకులను అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. వినియోగదారులు ఇప్పుడు క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, కొత్త మెటియోర్ 350 వంటి మోడళ్లను అమెజాన్‌లో నేరుగా, ఇంటి నుంచే సులభంగా బైకులను కొనేయొచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ సదుపాయం అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణే వంటి ఐదు కీలక నగరాల్లో అందుబాటులో ఉందని రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ అమెజాన్‌లో ప్రత్యేక బ్రాండ్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులు మోటార్ సైకిళ్లు, విడి భాగాలు, రైడింగ్ గేర్, కంపెనీకి చెందిన ఉత్పత్తులను ఒకే చోట లభిస్తాయి. కొనుగోలు చేసిన వాహనాల డెలివరీలు, అమ్మకాల తర్వాత సర్వీసుకు సంబంధించి కస్టమర్లు సమీపంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు. ఈ భాగస్వామ్యం ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు 350సీసీ బైకులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ డిజిటల్ సేవలను కంపెనీ దేశంలోని 10 నగరాల్లో అందిస్తుండగా, త్వరలో ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది. 

Leave a Comment