
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్‌మీట్లో సంచలన వ్యాఖ్యల వల్ల నేరెళ్ల కేసు (Nerella case) మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు (Santhosh Rao) చెప్తేనే పోలీసులు నేరెళ్ల బాధితులను కొట్టారని ప్రెస్‌మీట్లో కవిత ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంతోష్ రావుపై నేరెళ్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లి ఎస్ఐకి (Nerella case) నేరెళ్ల బాధితులు లేఖ రాశారు. మాజీ ఎంపీ సంతోష్ రావు ప్రోద్బలంతోనే పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు తెలిపారు. మాపై విచక్షణ రహితంగా దాడి చేశారని, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ అంశాన్ని ఉద్దేశించిన నిన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి నేరెళ్ల సంఘటన జరగడానికి ముఖ్య కారకులు జోగినపల్లి సంతోష్ రావు అని కవిత చాలా స్పష్టంగా చప్పారని లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకోని మాపైన దాడికి కారకులు అయిన సంతోష్ రావు, విశ్వజిత్ కంపాటి (ఐపీఎస్), సీసీఎస్ ఎస్ఐ రవిందర్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని కోరారు. మాపై దాడి చేసిన ఇతర పోలీసులు సిబ్బందిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, 2017 బీఆర్ఎస్ హయాంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక లారీలను తగలబెట్టారనే ఆరోపణలపై దళితులు, బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక లారీ ఢీకొనడంతో, ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు పలు ఇసుక లారీలను తగలబెట్టడంతో ఇష్యూ అయింది.