Chandrababu Naidu vs Congress : దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ (Bhartiya Janata Party) హవా నడుస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. దాదాపు పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. అయితే బలమైన శక్తిగా ఉన్న బిజెపిని ఆరు నెలల్లో గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ తరచూ ప్రకటన చేస్తోంది. దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ లను తమ వైపు తిప్పుకుంటే బీజేపీ గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ.. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల్లో స్వేచ్ఛనివ్వాలి అన్న ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు నితీష్ పై ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆ మూడు రాష్ట్రాల్లో ఓడించి..
త్వరలో బీహార్ ఎన్నికలు( Bihar elections ) జరుగుతాయి. అక్కడ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. బీహార్లో గెలుపొందడం ద్వారా బిజెపి పతనానికి నాంది పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు తరువాత పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థించి సీట్లు వదులుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్సాంలో సైతం బిజెపి అధికారంలో ఉంది. అక్కడ కూడా ఇండియా కూటమి గెలవడం ద్వారా.. దేశవ్యాప్తంగా రాజకీయ మార్పు తేవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
* తప్పనిసరి పరిస్థితుల్లోనే..
చంద్రబాబుతో( AP CM Chandrababu) పాటు నితీష్ కుమార్ తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి దగ్గరయ్యారు. అయితే రాష్ట్రాల్లో పట్టు సాధిస్తే ఆ ఇద్దరు నేతలు సైతం బిజెపిని విడిచి పెట్టేందుకు సిద్ధపడతారని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ ఓడిపోతే తప్పకుండా ఆయనపైనే ఓటమి భారం పెడుతుంది భారతీయ జనతా పార్టీ. అదే జరిగితే నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయం. మరోవైపు ఏపీలో సైతం చంద్రబాబు పునరాలోచనలో పడతారు. ఆ ఇద్దరు నేతలు అలా బయటకు వచ్చిన మరుక్షణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. కాంగ్రెస్ ఆలోచన అదే. అందుకే తరచూ అటువంటి ప్రకటనలు చేస్తూ వస్తోంది.
* పరస్పరం నమ్మకం లేక..
ఏపీ విషయంలో సైతం బిజెపి ఆలోచన అంతుపట్టడం లేదు. ఒకవైపు ఎన్డీఏలో( National democratic Alliance ) తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. కానీ బిజెపి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా చూడడం లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ఆప్షన్ గా ఉంచుకుంది. చంద్రబాబుకు ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అయితే రాష్ట్ర అవసరాల దృష్ట్యా బిజెపితో సర్దుకొని ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ప్రత్యర్థిగా చూడడం లేదు. అది బిజెపికి మింగుడు పడడం లేదు. అందుకే పరస్పరం పెద్దగా నమ్మకం లేకుండా పోతోంది ఆ రెండు పార్టీల మధ్య. ఒకవేళ బిజెపికి దేశవ్యాప్తంగా ఆదరణ తగ్గిందని తెలిసిన మరుక్షణం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయం. అయితే అది అంత సులువుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే కచ్చితంగా ఏపీ ప్రజలు తిరస్కరిస్తారు. అందుకే 2029 ఎన్నికల వరకు బిజెపితో జర్నీ ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.