ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఓ యువకుడు సెల్ టవర్‌పై ఎక్కి హంగామా చేశాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. పొందూరు మండలం కింతలి కనిమెట్టకు చెందిన శివకుమార్ అనే యువకుడు.. ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంపాట్‌కు చెందిన ఇందుమతి అనే యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందడం వల్ల.. అమ్మాయి కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోవడంలేదని శివకుమార్ చెబుతున్నాడు.
తాజాగా తనపై ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో దీపమహల్ దగ్గర ఉన్న BSNL సెల్ టవర్‌పై ఎక్కిపోయాడు. వెంటనే 112కు కాల్ చేసి తన గోడును పోలీసులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని శివకుమార్‌తో మాట్లాడి కిందికి దించేందుకు ప్రయత్నించారు. చివరికి చట్టప్రకారం న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వడంతో, అతను కిందికి దిగాడు.
ఆ తర్వాత అతనిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ‘ఇందుమతి నన్ను పెళ్లి చేసుకోకపోతే బతకనూ’ అంటూ శివకుమార్ చెప్పిన మాటలు అక్కడున్నవారిని కలచివేశాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.