మైత్రీబంధం

చైనాలో మోడీ, జిన్‌పింగ్‌, పుతిన్‌ల కలయిక
కరచాలనాలు…చిరునవ్వులు…ఆలింగనాలు
సుహృద్భావ వాతావరణంలో చర్చలు
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు : నరేంద్ర మోడీ
ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోసింది అమెరికానే : పుతిన్‌
ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించండి : ఎస్‌సీఓ సదస్సులో జిన్‌పింగ్‌
తియాంజిన్‌ (చైనా) :
అమెరికాతో అంతంత మాత్రంగానే సంబంధాలు కలిగిన భారత్‌, చైనా, రష్యా దేశాల నేతలు పరస్పరం చేతులు కలిపారు. కరచాలనాలు, చిరునవ్వులు, ఆలింగనాలతో సన్నిహితంగా మెలిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ ఆసక్తికర దృశ్యానికి చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) వేదికైంది. సదస్సు ముగిసిన తర్వాత మోడీ, పుతిన్‌ దాదాపు 40 నిముషాలపాటు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన తర్వాత ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడే జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. వారిద్దరూ సహకార సదస్సుకు ఒకే కారులో చేరుకున్నారు. సదస్సు ముగిసిన అనంతరం చర్చల నిమిత్తం పుతిన్‌తో కలిసి వెళ్లిపోయారు. పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. పుతిన్‌, జిన్‌పింగ్‌తో కలిసి ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మోడీ పోస్ట్‌ చేశారు. ‘తియాంజిన్‌ చర్చలు కొనసాగుతాయి. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా పుతిన్‌, జిన్‌పింగ్‌తో అభిప్రాయాలు పంచుకున్నాను’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పుతిన్‌, మోడీ పరస్పరం చేతులు కలిపి నడుస్తూ, జిన్‌పింగ్‌ వద్దకు వెళ్లారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్నారు.

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు : మోడీ పిలుపు
ఉగ్రవాదంపై పోరు విషయంలో దృఢమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని సదస్సుకు హాజరైన నేతలను మోడీ కోరారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ‘ద్వంద్వ ప్రమాణాలు’ పాటించరాదని సూచించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాలను, మద్దతు ఇస్తున్న దేశాలను బాధ్యులను చేయాలని కోరారు. ఉగ్రవాదం కారణంగా భారత్‌ నాలుగు దశాబ్దాలుగా నష్టపోతోందన్నారు. అనేక మంది తల్లులు తమ పిల్లల్ని కోల్పోయారని చెప్పారు. ‘ఇటీవలే పహల్గాంలో ఉగ్రవాద వికృత రూపాన్ని చూశాము. ఆ సంక్షోభ సమయంలో మాకు మద్దతు తెలిపిన స్నేహితులకు కృతజ్ఞతలు. ఇది భారత భూభాగంపై జరిగిన దాడి మాత్రమే కాదు. మానవత్వంపై నమ్మకం ఉంచే ప్రతి దేశానికీ బహిరంగ సవాలే. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బాహాటంగా మద్దతు ఇవ్వడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా భద్రత, శాంతి, స్థిరత్వం కీలకమని చెప్పారు. అయితే ఆ దారిలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి పెను సవాలుగా నిలిచాయని అన్నారు. ఉగ్రవాదం మానవత్వానికే సవాలు విసురుతోందనీ, దానిపై పోరులో ఐక్యత అవసరమని స్పష్టం చేశారు.

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన సభ్యదేశాలు
షాంఘై సదస్సుకు హాజరైన సభ్య దేశాలన్నీ పహల్గాం ఉగ్రదాడిని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. ఇలాంటి దాడులకు కుట్ర చేసే వారిని, నిర్వహించే వారిని, మద్దతు ఇచ్చే వారిని చట్టం ముందు నిలపాలని సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. కిరాయి పనుల కోసం ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద గ్రూపులను వాడుకునేందుకు చేసే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావని తేల్చి చెప్పాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని సదస్సు తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు తగవన్న భారత్‌ అభిప్రాయంతో ఏకీభవించింది. సీమాంతర ఉగ్రవాదుల కదలికలు సహా ఉగ్రవాదంపై పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. భారత్‌ వైఖరితో సదస్సు డిక్లరేషన్‌ ఏకీభవించింది. ఎస్‌సీఓలో పాకిస్తాన్‌ కూడా సభ్య దేశమే కావడం గమనార్హం. ఈ సదస్సుకు పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు.

ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోసింది అమెరికానే : పుతిన్‌
ఉక్రెయిన్‌పై తాము జరుపుతున్న దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర్ధించుకున్నారు. మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఆజ్యం పోసింది పశ్చిమ దేశాలేనని విమర్శించారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి సంక్షోభానికి కారణం కాదు. ఉక్రెయిన్‌లో జరిగిన కుట్రే దానికి కారణం. ఆ కుట్రకు అమెరికా మద్దతు ఇచ్చింది. రెచ్చగొట్టింది’ అని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చడానికి అమెరికా చేస్తున్న నిరంతర ప్రయత్నం కూడా ఈ పరిస్థితికి కారణమేనని స్పష్టం చేశారు. కాలం చెల్లిన యూరో కేంద్రీకృత, యూరో-అట్లాంటిక్‌ నమూనాల స్థానంలో అనేక దేశాలకు ప్రయోజనం కలిగించే వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం కోసం భారత్‌, చైనా, ఇతర వ్యూహాత్మక భాగస్వాముల ప్రయత్నాలు, ప్రతిపాద నలకు అత్యంత విలువ ఇస్తామని పుతిన్‌ తెలిపారు.

ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించండి : జిన్‌పింగ్‌
ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఎస్‌సీఓ సభ్యదేశాలను కోరారు. ప్రపంచం అస్తవ్యస్థంగా అల్లుకుపోయిన నేపథ్యంలో సభ్య దేశాలు సంక్లిష్టమైన భద్రత, అభివృద్ధికి సంబంధించి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ‘వెనక్కి చూసుకుంటే అల్లకల్లోలంగా ఉన్న సమయంలో కూడా షాంఘై స్ఫూర్తిని ఆచరించి విజయాలు సాధించాం. భవిష్యత్‌లోకి చూస్తే ప్రస్తుతం ప్రపంచం పరివర్తనకు గురవుతోంది. కాబట్టి మనం షాంఘై స్ఫూర్తిని కొనసాగించాలి. పాదాలను నేలపై ఉంచుతూ ముందుకు సాగాలి. సంస్థ విధులను మరింత మెరుగ్గా నిర్వర్తించాలి’ అని కోరారు. సమానమైన, క్రమబద్ధమైన బహుళ ధృవ ప్రపంచం కోసం సమంజసమైన ప్రపంచ పాలనా వ్యవస్థను రూపొందించడానికి సభ్య దేశాలు కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది సభ్య దేశాలకు 280 మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తామని, ఎస్‌సీఓ బ్యాంకింగ్‌ కన్సార్టియంకు 1.4 బిలియన్ల రుణాన్ని ఇస్తామని ప్రకటించారు. వాణిజ్యాన్ని, పెట్టుబడుల స్థాయిని పెంచుకోవడానికి భారీ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని జిన్‌పింగ్‌ చెప్పారు.

The post మైత్రీబంధం appeared first on Navatelangana.

Leave a Comment