భారత్‌-రష్యా సంబంధాలు రాజకీయాలకు అతీతం : ప్రధాని మోదీ

ఎప్పుడైనా కష్టకాలం వచ్చినా న్యూఢిల్లీ-మాస్కో ఒకరికి మరొకరు భరోసాగా నిలుస్తూ వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న బంధం కేవలం రెండు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నతకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.
భారత్-రష్యా ద్వైపాక్షిక సదస్సు తింజాయన్‌లోని రిట్జ్ కార్లటన్ హోటల్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని మానవాళి ఆకాంక్షిస్తోందని, ఇరుపక్షాలు ఆ దిశగా అడుగులు వేస్తాయని నమ్ముతున్నామని తెలిపారు. ఇటీవల జరుగుతున్న శాంతి ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, డిసెంబర్‌లో జరగనున్న భారత్-రష్యా సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ రాక కోసం 140 కోట్ల భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మోదీ అన్నారు.

తరచూ జరుగుతున్న ఉన్నతస్థాయి భేటీలు ఇరుదేశాల మధ్య ఉన్న ప్రత్యేక బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్-రష్యా సంబంధాలు కొన్ని సూత్రాలపై ఆధారపడి బలంగా కొనసాగుతున్నాయని, బహుముఖ సహకారంతో తాము ముందుకు సాగుతున్నామని వివరించారు.తమ బంధం రాజకీయాలకు అతీతంగా ఎంతో విశ్వాసపూర్వకంగా ఉందని మోదీ అభివర్ణించారు. ఇక ఈ భేటీలో పుతిన్ మాట్లాడుతూ, షాంఘై సహకార సదస్సు గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాలకు బలమైన వేదికగా నిలుస్తోందని అభివర్ణించారు. రానున్న భారత్-రష్యా ద్వైపాక్షిక సదస్సు తమ బహుముఖ బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Comment