మన శరీరానికి నీరు చాలా అవసరం. తగినంత నీరు తాగకపోతే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువ నీరు తాగే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వారి రోజువారీ పనులపై పడుతుంది. ముఖ్యంగా శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ప్రయోగం ఎలా జరిగింది..?
కొంతమంది ఆరోగ్యవంతులైన యువకులను వారి నీరు తాగే అలవాట్ల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు. ఒక వారం పాటు వారు తమ అలవాట్లను కొనసాగిస్తూ ఒత్తిడి పరీక్షల్లో పాల్గొన్నారు. పరీక్షల తర్వాత.. తక్కువ నీరు తాగిన వారి శరీరంలో కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉందని తేలింది.
డీహైడ్రేషన్‌ను ఇలా గుర్తించండి..
మనకు దాహం వేసినప్పుడే నీరు తాగడం సరిపోదు. ఎందుకంటే దాహం వేస్తేనే మీరు డీహైడ్రేషన్‌లో ఉన్నారని కాదు. ఈ అధ్యయనంలో తక్కువ నీరు తాగిన వారికి దాహం వేయలేదు. కానీ వారి మూత్రం ముదురు రంగులో తక్కువగా ఉంది. ఇది డీహైడ్రేషన్‌కు స్పష్టమైన సంకేతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హార్మోన్ల ప్రభావం
శరీరంలో నీరు సరిపోకపోతే మెదడు వాసోప్రెసిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో నీటిని నిల్వ చేస్తుంది. అదే సమయంలో ఇది ఒత్తిడిని పెంచే కార్టిసాల్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఈ రెండు హార్మోన్ల ప్రభావం వల్ల శరీరంలో ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఎక్కువ కాలం ఉండే ఒత్తిడి గుండె జబ్బులు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సలహాలు
నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలాగైతే ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైనవో.. అదే విధంగా నీరు కూడా మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం అని ఈ పరిశోధన చెబుతోంది. నీరు అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోయినా.. అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. మీ మూత్రం రంగును చూసి మీ శరీరంలో నీటి స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగుతారో తెలుసుకునేందుకు మీ మూత్రం రంగును గమనించడం అలవాటు చేసుకుంటే మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
[